Andhra Pradesh: నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు.. 500 మందికి ఉపాధి
ఈ వార్తాకథనం ఏంటి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన అల్లానా గ్రూప్ ఆహారశుద్ధి రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతోంది.
ఇఫ్‌కో సంస్థతో కలిసి రాష్ట్రంలో రూ.200 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నూజివీడు ప్రాంతంలో పౌల్ట్రీ, పండ్ల ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించనుంది.
దీని ద్వారా 500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్-2025 సదస్సులో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఆహారశుద్ధి సొసైటీ సీఈఓ గడ్డం శేఖర్‌బాబు, అల్లానా/ఇఫ్‌కో గ్రూప్ ఎండీ ఇర్ఫాన్ అల్లానా, డైరెక్టర్ మోయిజ్ చినవాలా, సీఈఓ మనీష్ ములే ఈ పెట్టుబడి ఒప్పందంపై సంతకాలు చేశారు.
వివరాలు
ఆహారశుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీలలో అల్లానా గ్రూప్ ఒకటి
యూఏఈ కేంద్రంగా పనిచేస్తున్న అల్లానా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఆహారశుద్ధి రంగంలో అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉంది.
150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థకు 85 దేశాల్లో యూనిట్లు ఉన్నాయి.
ఇదే సమయంలో, రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేందుకు, పొలం నుంచి మార్కెట్ విధానాలను అభివృద్ధి చేయడానికి, సుస్థిర వ్యవసాయ వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు హరియాణాలోని గుర్‌గ్రామ్‌కు చెందిన కిసాన్‌సే ఆగ్‌టెక్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
దుబాయ్‌లో జరుగుతున్న ప్రపంచస్థాయి ఫుడ్‌షోలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనపై పలు ప్రముఖ సంస్థలతో చర్చలు నిర్వహిస్తోంది.