
Amarawati: రాజధాని అమరావతిలో మరో కీలక నిర్మాణానికి ముందడుగు..రూ.600 కోట్లతో ఎన్‌ఆర్‌టీ ఐకాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి నగరానికి అద్దం పట్టేలా ఎన్‌ఆర్‌టీ ఐకాన్ భవనాన్ని ఆంగ్ల అక్షరం 'A' ఆకృతిలో డిజైన్ చేశారు.
రెండు టవర్ల మధ్య గ్లోబ్ ఏర్పాటు చేయనున్నారు. మొత్తం భవన నిర్మాణ విస్తీర్ణం 11.65 లక్షల చదరపు అడుగులు.
అమరావతిలో మరో విశిష్ట నిర్మాణం
రాజధాని అమరావతిలో మరో ప్రతిష్టాత్మక నిర్మాణానికి నాంది పలికింది. పరిపాలన నగరంలో ప్రవాసాంధ్రుల కోసం ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ సంస్థ 5 ఎకరాల విస్తీర్ణంలో 'ఎన్‌ఆర్‌టీ ఐకాన్' పేరుతో భారీ భవనాన్ని నిర్మించనుంది.
ఈ ప్రాజెక్టును మూడుదశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో ఫౌండేషన్ నిర్మాణాన్ని చేపడతారు.
రెండో దశలో భవన సూపర్ స్ట్రక్చర్‌కు టెండర్లు పిలుస్తారు. మూడో దశలో ఫసాడ్ (బయటి అందమైన భాగం) నిర్మాణాన్ని పూర్తిచేస్తారు.
వివరాలు
రూ. 600 కోట్లతో జంట టవర్ల నిర్మాణం
ఈ జంట టవర్ల నిర్మాణానికి రూ. 600 కోట్ల అంచనా వ్యయం ఉంది. 2028 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
ఈ భవనాన్ని పూర్తిగా ప్రవాసాంధ్రుల కోసం వారి నిధులతోనే నిర్మించనున్నారు. నివాస ఫ్లాట్లు, కార్యాలయ ప్రదేశాలు వారికి మాత్రమే విక్రయిస్తారు.
భవన నిర్మాణ విధానం
ఈ భవనం మొత్తం 36 అంతస్తుల ఉత్కృష్టమైన నిర్మాణంగా రూపొందించనున్నారు.
2 అంతస్తుల సెల్లార్ (పార్కింగ్ కోసం)
3 అంతస్తుల పోడియం
33 అంతస్తుల భవనం
రెండు టవర్లలో ఒక్కొక్కదాంట్లో 29 అంతస్తులు
ఒక టవర్‌లో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి. ఒక్కో అంతస్తులో 2 ఫ్లాట్లు ఉండేలా డిజైన్ చేశారు. రెండో టవర్‌లో కార్యాలయాలు, వాణిజ్య ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
ఉద్యోగ అవకాశాలు
ఈ కార్యాలయాల్లో 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రెండు టవర్లను కలుపుతూ పైన నాలుగంతస్తుల వాణిజ్య ప్రదేశాలు నిర్మించనున్నారు.
గ్లోబ్ - ప్రత్యేక ఆకర్షణ
రెండు టవర్ల మధ్యలో గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ గ్లోబ్‌లో 4 అంతస్తులు ఉంటాయి. 360 డిగ్రీ వ్యూ కోసం రివాల్వింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ గ్లోబ్‌లో
10-12 వేల చదరపు అడుగుల విస్తీర్ణం
రెస్టారెంట్లు, కిచెన్, ఎగ్జిక్యూటివ్ డైనింగ్ హాల్, లాంజ్
ఎన్‌ఆర్‌టీ క్లబ్ హౌస్ వంటివి ఏర్పాటు చేయనున్నారు
వివరాలు
పోడియంలోని ప్రత్యేక వసతులు
పోడియంలోని మూడు అంతస్తుల్లో
మైగ్రేషన్ రిసోర్స్ సెంటర్
కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ, ఫుడ్ కోర్ట్
2 వేల సీట్ల ఆడిటోరియం, 1500 సీట్ల యాంఫీ థియేటర్ వంటి వసతులు ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
2014-19లో ప్రాజెక్టు ప్రారంభం - వైకాపా హయాంలో ఆలస్యం
ఈ ప్రాజెక్టుకు తొలి రూపురేఖలు 2014-19లో తెదేపా ప్రభుత్వం హయాంలోనే సిద్ధం అయ్యాయి.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో శంకుస్థాపన చేశారు. ప్రవాసాంధ్రులు రూ. 33 కోట్లు ముందుగా చెల్లించారు.
అయితే, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు ప్రశ్నర్ధకంగా మారింది. అమరావతిని అభివృద్ధి చేయకుండా జగన్ ప్రభుత్వం దీన్ని అడ్డుకుంది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రాజెక్టును పునరుద్ధరించింది. న్యాయపరమైన సమస్యలను అధిగమించి భవన నిర్మాణాన్ని మళ్లీ ప్రారంభించింది.