హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ
అమరావతి రైతులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇళ్ల పట్టాల పంపిణీపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నో చెప్పింది. అమరావతి రైతులు ఆర్-5 జోన్ పై దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. అదే విధంగా ఇళ్ల పట్టాలపై పంపిణీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని సూచించింది. దీంతో అమరావతి రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఆర్-5 జోన్ ఏర్పాటు చేసిందని, రాజధాని అవసరాల కోసం ఇచ్చిన భూములను ఇతరులకు ఇచ్చారని రైతులు ఆరోపించారు.ఆర్-5 జోన్ ఏర్పాటు, ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ రైతులు పిటిషన్ వేశారు. ఈపిటిషన్ పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది.దీనిపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజే ధర్మాసనం నిరాకరించింది.
సుప్రీంకోర్టుకు వెళ్లనున్న రైతులు
రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఆర్-5 జోన్ గా మార్చి పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం వైసీపీ ప్రభుత్వం 1134 ఎకరాలను కేటాయించింది. ఈ అంశంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు నో చెప్పడంతో రైతులు శనివారం సుప్రీంకోర్టును అశ్రయించనున్నారు. అదే విధంగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయాలని రైతులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జోన్ పేరుతో సీఆర్డీఏ చట్ట సవరణ చేసింది. ప్రస్తుతం రైతుల పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆర్-5 జోన్ లో ఇళ్ల స్థలాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమం అయింది.