ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్
సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన కొన్ని నిర్ణయాలపై విచారణకు బుధవారం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. చంద్రబాబు హయాంలో జరిగిన అమరావతి భూముల అవకతవలు సహా ఇతర నిర్ణయాలపై సిట్ విచారణపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గత ప్రభుత్వాల తప్పిదాలపై దర్యాప్తు చేసే అధికారం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు ఉందని జస్టిస్ ఆర్‌ఎం షా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
అమరావతి భూములపై విచారణకు సిట్ ఏర్పాటు
అమరావతి భూములు, ఇతర అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణ ప్రారంభించగానే టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. సిట్ దర్యాప్తుపై హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రజాధనం వృధా లేదా దుర్వినియోగం అయినప్పుడు విచారణలు అనుమతించబడతాయని, అటువంటి దర్యాప్తులను నిలిపివేయడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. అమరావతి భూముల్లో పలువురు టీడీపీ నేతలు అక్రమాలు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. ఈ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.