Amaravati: గ్రీన్‌ఫీల్డ్ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్ నగరం: ఆర్థిక సర్వే
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది. సులభమైన జీవనానికి అనుకూలంగా,ఈ నగరం భవిష్యత్తులో ఒక మోడల్ సిటీగా నిలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఉన్న నగరాల్లో సేవల లోపం,అనధికార నిర్మాణాల పెరుగుదల వంటి సమస్యలను పరిష్కరించడానికి మార్పులు చేయడం కంటే, గ్రీన్‌ఫీల్డ్ విధానంలో కొత్త నగరాన్ని నిర్మించడం ద్వారా ముందే ప్రణాళికాబద్ధంగా జీవన వ్యవస్థను రూపకల్పన చేయవచ్చని ఆర్థిక సర్వే వివరించింది. సర్వే ప్రకారం, భారీ మౌలిక సౌకర్యాలపై ఆధారపడే నగరాలకంటే, విద్య, ఆరోగ్యం, వ్యాపారం వంటి రంగాలతో సమన్వయం సాధించే నగరాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. అమరావతి ఈ విధంగా కచ్చితమైన ప్రణాళికతో నిర్మించబడిన ఒక దృష్టాంతంగా నిలుస్తుందని సర్వే స్పష్టం చేసింది.
వివరాలు
దేశంలోని పది నివాస యోగ్య నగరాల్లో.. తిరుపతి, విజయవాడ
దేశంలోని పది నివాస యోగ్య నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, విజయవాడ నగరాలు చోటు దక్కించుకున్నాయి. వీటి జీవన సౌలభ్యత సూచికలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. బెంగళూరు, ఢిల్లీ, ముంబయి వంటి పెద్ద నగరాల్లోని ఘన జనాభా ఒత్తిడి తిరుపతి, విజయవాడలో లేవని సర్వే పేర్కొంది. ఇక్కడ నగరీకరణ పద్ధతిగా జరుగుతూ, మౌలిక సౌకర్యాలు, ఉద్యోగావకాశాలు సులభంగా లభించవని సర్వే వివరించింది. అగ్రస్థానంలోని నగరాలు: పుణె, నవీ ముంబయి, గ్రేటర్ ముంబయి, తిరుపతి, చండీగఢ్, ఠాణె, రాయ్‌పుర్, ఇండోర్, విజయవాడ, భోపాల్.
వివరాలు
నిజమైన నివాస యోగ్య నగరాలంటే
ప్రపంచంలో జీవన సౌకర్యం ఉన్న నగరాలు అన్నీ కొత్తవే కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజల రోజువారీ జీవన ఇబ్బందులు తగ్గి, వారి వ్యక్తీకరణకు, సృజనాత్మకతకు అవకాశం కల్పించే నగరాలు నిజమైన నివాసయోగ్య నగరాలుగా గుర్తించబడ్డాయి. కేవలం మౌలిక సౌకర్యాల కల్పనతో మాత్రమే కాదు, ప్రజల సమయం, వారి ఎంపికలు, సృజనాత్మకతను గౌరవించే విధంగా నిర్మించబడిన నగరాలు అసలు జీవనయోగ్యంగా ఉంటాయని ఆర్థిక సర్వే తెలిపింది.
వివరాలు
ఇవే ఉదాహరణ
డెట్రాయిట్: రహదారులు, పరిశ్రమలు, స్టేడియాలు నిర్మించడానికి భారీ పెట్టుబడులు పెట్టినా, ఆర్థిక ఉత్పాదకత పరంగా తగిన ఫలితాలు లభించలేదు. ఫలితంగా, జనాభా తగ్గింది. బోస్టన్: మౌలిక సౌకర్యాలు పరిమితం అయినప్పటికీ, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల వల్ల నగర అభివృద్ధి కొనసాగింది. బెంగళూరు: మౌలిక సౌకర్యాలు తక్కువగా ఉన్నా, ఇంజినీరింగ్ నైపుణ్యం, వ్యాపార, పారిశ్రామిక పరిసరాల వల్ల భారతదేశ సిలికాన్ వ్యాలీగా ఎదిగింది. వీటిలో ప్రధానంగా విద్య, ఆరోగ్యం, హౌసింగ్, నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, రవాణా, భద్రత, వినోదం వంటి అంశాలను కొలుస్తారు. వీటిని ఆధారంగా నగరాల్లో జీవన నాణ్యతను అంచనా వేస్తారు.