Amaravati: అమరావతి రెండో దశకు మాస్టర్‌ప్లాన్.. 709.6 చ.కి.మీ.లో భారీ విస్తరణ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి. మాస్టర్‌ప్లాన్‌తో పాటు ఆర్థిక ప్రణాళికను కూడా ఒకేసారి సిద్ధం చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం గ్లోబల్ టెండర్లు పిలిచి ప్రముఖ సంస్థలను ఎంపిక చేసింది. మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతను సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్‌కు అప్పగించగా,మౌలిక వసతుల ప్రణాళిక కోసం ఆర్వీ అసోసియేట్స్‌ను ఎంపిక చేశారు. ఇక ఆర్థిక ప్రణాళిక బాధ్యతను నైట్‌ఫ్రాంక్‌కు అప్పగించారు. ఈ మూడు సంస్థల సహకారంతో ఆరు నెలల్లో పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలని గడువు విధించారు. ఇప్పటికే అమరావతి తొలి దశలో మాస్టర్‌ప్లాన్, సీడ్ క్యాపిటల్ ప్లాన్,సీఆర్‌డీఏ ప్రాంతానికి ముసాయిదా ప్రణాళికలను సుర్బానా జురాంగ్ రూపొందించగా,మౌలిక వసతుల ప్రణాళికను ఆర్వీ అసోసియేట్స్ రూపొందించింది.
వివరాలు
అమరావతి తొలి దశకు కొనసాగింపుగా రెండో దశ
ఈ అనుభవం రెండో దశ ప్రణాళిక వేగంగా, సమగ్రంగా పూర్తవ్వడానికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అమరావతి తొలి దశను 'నవ నగరాలు' కాన్సెప్ట్‌తో రూపొందించారు. 'వాక్ టు వర్క్' సిద్ధాంతంతో హరిత, నీలి నగరంగా అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం రాజధాని ప్రాంతంలో 30 శాతం పైగా హరిత వనాలు, జలాశయాలు, కాలువలు ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక వసతుల పరంగా అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారు. విద్యుత్, తాగునీరు, మురుగునీరు, వర్షపు నీటి పారుదల, ఐసీటీ కేబుళ్లు అన్నీ భూగర్భ డక్ట్‌ల ద్వారా వెళ్లేలా రహదారులు నిర్మిస్తున్నారు.
వివరాలు
రెండో దశలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్
ఇప్పుడు విస్తరించే ప్రాంతాన్ని కూడా ఇదే స్థాయిలో అభివృద్ధి చేసి తొలి దశతో అనుసంధానం చేయాలన్నది లక్ష్యం. స్పేషియల్ ప్లానింగ్ ద్వారా పరిశ్రమలు, ప్రాజెక్టులు, డెవలప్‌మెంట్ నోడ్‌లు ఎక్కడ ఉండాలి అన్నది నిర్ణయిస్తారు. అలాగే రవాణా, ట్రంక్ రోడ్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వంటి మౌలిక వసతుల ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం భూసమీకరణ జరుగుతున్న ఏడు గ్రామాలకు వివరమైన మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. మిగతా 43 గ్రామాలకు స్ట్రక్చర్ లేదా సూచనాత్మక ప్రణాళికను సుర్బానా జురాంగ్ సిద్ధం చేస్తుంది. రెండో దశలో స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ వంటి ప్రాజెక్టులు ప్రతిపాదిస్తున్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయం సహా మరిన్ని ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో ఇప్పటినుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
వివరాలు
ఆర్థిక వనరులపై స్పష్టమైన వ్యూహం
రాజధాని నిర్మాణానికి వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. వాటిని తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వానికి మిగిలే భూముల విక్రయం, దీర్ఘకాలిక లీజులు, జాయింట్ డెవలప్‌మెంట్ ఒప్పందాలు, పన్నులు వంటి వనరులను వినియోగించాలన్నది ప్రభుత్వ యోచన. ఇదే విధానాన్ని రెండో దశలో కూడా అమలు చేయనున్నారు. ఈ ఆర్థిక వ్యూహాన్ని రూపొందించే బాధ్యతను నైట్‌ఫ్రాంక్‌కు అప్పగించారు. దీంతో ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులపై స్పష్టత రానుంది.
వివరాలు
రెండో దశలో 709.6 చ.కి.మీ. విస్తరణ
అమరావతి తొలి దశలో 217 చ.కి.మీ. ప్రాంతానికి 2015లో సుర్బానా జురాంగ్ మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు సింగపూర్ ప్రభుత్వం ఈ ప్రణాళికను సిద్ధం చేయించింది. ఇప్పుడు విస్తరణలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చ.కి.మీ. ప్రాంతానికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయనున్నారు. ఈ పరిధిలో 50 గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఏడు గ్రామాల్లో ఇప్పటికే భూసమీకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి భూసమీకరణ చేపడతారు. అయితే మొత్తం ప్రాంతానికి ముందుగానే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
రెండో దశలో 709.6 చ.కి.మీ. విస్తరణ
రాజధాని పరిధిలో ఉత్తరాన కృష్ణా నది నుంచి దక్షిణాన ఔటర్ రింగ్ రోడ్ వరకు, తూర్పున చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి వరకు ఉన్న ప్రాంతాన్ని ఇందులో చేర్చారు. రెండో దశలో మొత్తం 1,75,347 ఎకరాల భూమికి మాస్టర్‌ప్లాన్ రూపొందించనున్నారు. ఇందులో ఏడు గ్రామాల్లో 20,494 ఎకరాలు, మిగతా 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలు ఉన్నాయి.