
Amaravati: అమరావతి 'ట్రాన్స్‌లొకేషన్ నర్సరీ' విధానాన్ని ప్రశంసించిన ప్రపంచ,ఏడీబీ బ్యాంకుప్రతినిధులు
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి నగర అభివృద్ధి, మౌలిక వసతుల ఏర్పాట్ల కోసం ప్రణాళికాబద్ధంగా చేపట్టబడుతున్న పర్యావరణ, సామాజిక రక్షణ కార్యక్రమాలను సమీక్షించేందుకు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడీబీ) ప్రతినిధుల బృందం గురువారం అమరావతి రాజధానిని సందర్శించింది. నిర్మాణ పనుల పురోగతి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, సామాజిక సంక్షేమ చర్యలు తమ ప్రమాణాల మేరకు అమలు అవుతున్నాయా అనే అంశాలను బృంద సభ్యులు సమీక్షించారు. ఈ సమీక్షలో వారు పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా,తొలి రోజు గెజిటెడ్ అధికారుల టైప్-1, టైప్-2 నివాస సముదాయాలు,నాన్ గెజిటెడ్ అధికారుల భవన సముదాయాలు,ఈ-6 రహదారి నిర్మాణ పనులు,ఎల్‌పీఎస్-2ఏ, ఎల్‌పీఎస్-1ఏ జోన్లలో జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలను పరిశీలించారు.
వివరాలు
కార్మికులకు సూచనలు
అదనంగా, కార్మికులకు గుత్తేదారు సంస్థలు అందిస్తున్న మౌలిక వసతుల స్థితిని పరిశీలించి, అవసరమైన సూచనలు కూడా అందించారు. తుళ్లూరులో ఉన్న నైపుణ్య శిక్షణ భవనం,ఎన్-9 ట్రంక్ రోడ్ పనులు,శాఖమూరు,నీరుకొండ రిజర్వాయర్ల వద్ద పర్యావరణ,సామాజిక రక్షణ చర్యల అమలును కూడా పరిశీలించారు. తుళ్లూరు స్కిల్ హబ్ ప్రాంగణంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు, స్థానికులతో చర్చలు నిర్వహించారు. అమరావతి అభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న ట్రాన్స్‌లొకేషన్ నర్సరీ విధానాన్ని బృంద సభ్యులు ప్రశంసించారు. ఈ విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా మోడల్ గా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెద్ద చెట్లను నరికి వేయకుండా,వాటిని వేర్లతో సహా యంత్రాలతో జాగ్రత్తగా తొలగించి, ప్రత్యేక పద్ధతుల ద్వారా సంచుల్లో సంరక్షించి అవసరమైన ప్రాంతాల్లో మళ్లీ నాటే విధానాన్ని వారు అద్భుతంగా గుర్తించారు.
వివరాలు
మరో 6 వేల చెట్ల ట్రాన్స్‌లొకేషన్
అనంతవరం నర్సరీ ప్రపంచానికే దిక్సూచి కాబోతోందని పేర్కొన్నారు. ఈ వ్యవస్థను ఇతర దేశాలకు పరిచయం చేయనున్నట్టు బృంద సభ్యులు వెల్లడించారు. ఏడీసీ ఉద్యాన విభాగం జాయింట్ డైరెక్టర్ వి.ఎస్. ధర్మజ వారు చెట్ల సంరక్షణ విధానాలు వివరించారు. అంతేకాక, రాజధానిలో మరో 6 వేల చెట్లను ట్రాన్స్‌లొకేషన్ చేయనున్నట్లు కూడా ప్రకటించారు.