Amaravati: డిసెంబర్ 1 నుంచి అమరావతి పనులు షురూ .. నాలుగేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళికలు
అమరావతి నిర్మాణ పనుల ప్రారంభానికి సంబంధించి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అందింది. డిసెంబర్ 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు. రూ.60వేల కోట్ల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ముందుగా చేసిన నిర్మాణ పనును పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలిగించే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఈ పనులన్నీ పూర్తియైన వెంటనే రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం
అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దుతామని, ఇందు కోసం పెద్ద ఎత్తున్న పార్కుల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రపంచంలోనే టాప్-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. శాఖమూరులో 300 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్ పార్కు, రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, అనంతవరం, మల్కాపురంలో పార్క్‌ల నిర్మాణాన్ని కూడా చేపట్టామన్నారు. ఆరు నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో గ్రీనరీతో పాటు ఆక్సిజన్ శాతం పెంచేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దీని కోసం ఉద్యానవనాలు నిర్మించేందుకు సిద్ధమైంది.