అమర్నాథ్ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు
అమర్నాథ్ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది. అమర్నాథ్కు వెళ్లే మార్గంలో ఏ ఆహారాన్ని తినొచ్చు, ఏ ఆహారాన్ని వెంట తీసుకెళ్లకూడదో తెలుసా జూలై 1 నుంచే అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ మొదలుకానుంది. అయితే ఈ యాత్రలో పర్వతాలను దాటితేనే అమర్ నాథుడ్ని చేరుకునేది. చల్లని వాతావరణంలో పర్వత మార్గం ఎక్కడం అంటే కష్టంతో కూడుకున్న పని. కనుక అమర్నాథ్ యాత్ర కోసం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రత్యేక చిట్కాలు మీ కోసం.
అమర్నాథ్కు అత్యంత ప్రసిద్ధమైన మార్గం అనంత్‌నాగ్ జిల్లాలోని పహెల్గావ్
1. జూలై 1 నుంచి యాత్ర ప్రారంభమై ఆగస్టు 31 వరకు కొనసాగుతుంది. దాదాపు 542 బ్యాంకుల ద్వారా అమర్నాథ్ యాత్రకు నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నిమిత్తం ఆధార్ కార్డు ఉండాల్సిందే. 2. పుణ్యక్షేత్రం బోర్డు నిబంధనల మేరకు 13 ఏళ్లలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వారు అమర్నాథ్ యాత్ర చేయకూడదు. ఇక్కడ ట్రెక్కింగ్ చేయాలన్నా శారీరకంగా దృఢంగా ఉండాలి. 3. మీరు రెండు మార్గాల ద్వారా అమర్నాథ్ చేరుకోవచ్చు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహెల్గావ్ ద్వారా అమర్నాథ్ రావొచ్చు. ఇది అమర్నాథ్కు అత్యంత ప్రసిద్ధమైన మార్గం. అలా కాకుండా మరో మార్గం ఏమిటంటే, గందర్బల్ జిల్లాలోని బల్తాట్ గుండా కూడా చేరుకోవచ్చు.
పప్పులు, బియ్యం, కూరగాయలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్
4. యాత్రలో జంక్ ఫుడ్ పై నిషేధం పెట్టారు. కూల్‌డ్రింక్స్, జెల్లీ, హల్వా లాంటి స్వీట్లు, పూరీ, చోలె భటూరా వంటి నూనె పదార్థాలు తీసుకెళ్లేందుకు పనికి రావు. ఫ్రైడ్ రైస్, పిజ్జా, బర్గర్లు, పరాటాలు, దోశలు, వెన్నరొట్టెలు, పచ్చళ్లు, చట్నీలు, ఫ్రైడ్ చిప్స్ కూడా నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. 5. అమర్నాథ్ యాత్రలో మీకు బియ్యం, పలు రకాల పప్పులు, కూరగాయలు, సోయాబీన్స్, గ్రీన్ సలాడ్, పండ్లు, జీలకర్ర అన్నం, ఖచొరి లభిస్తాయని బోర్డు చెప్పింది. హెర్బల్ టీ, కాఫీ, తక్కువ కొవ్వు ఉన్న పాలు, పండ్ల రసం, నిమ్మకాయ గుమ్మడికాయ, కూరగాయల సూప్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.
దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో అమర్ నాథుడి దర్శనం
6. యాత్రలో మత్తు పదార్థాలను అనుమతించరు. అమర్నాథ్ యాత్రలో మద్యం, పొగాకు, గుట్కా, బీన్ మసాలా, ధూమపానం వంటి అన్ని రకాల మత్తు పదార్థాలపై కఠినమైన నిషేధాజ్ఞలు ఉన్నాయి. కొండ మార్గాల్లో నడిచేటప్పుడు మాత్రం డ్రై ఫ్రూట్స్‌ను కూడా తీసుకెళ్లవచ్చని బోర్డు తెలిపింది. ఈ సంవత్సరం దాదాపు 62 రోజుల్లో, లక్షలాది మంది భక్తులు హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ మంచులింగాన్ని దర్శించుకోనున్నారు. ఉత్తర భారతావనికి దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో, భూమికి 3,880 మీటర్ల ఎత్తులో అమర్నాథ్ ఆలయం ఉంది. ఇక్కడ కొలువైన మంచు లింగం పరమేశ్వరుడి దర్శనం కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా ఏటా దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలిరావడ విశేషం.