అన్నామలై వ్యాఖ్యలతో ఏఐఏడీఎంకే-బీజేపీ పొత్తు విచ్ఛిన్నం అవుతుందా?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఏఐఏడీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మాజీ సీఎం జయలలితపై అన్నామలై పరోక్షంగా చేసిన విమర్శలు ఇప్పుడు బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమికి బీటలు వారే పరిస్థితిని తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. తమిళనాడులో 2024 లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ)కి 25+ సీట్లు సాధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యాన్ని నిర్దేశించిన మరుసటిరోజే బీజేపీ-ఏఐఏడీఎంకే మధ్య డైలాగ్ వార్ రెండు పార్టీల పొత్తు ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇంతకీ అన్నామలై చేసిన వివాదాస్పద కామెంట్స్ ఏంటి? నిజంగా జయలలితను ఉద్దేశించి ఆయన కామెంట్స్ చేశారా? అన్నామలైపై ఏఐఏడీఎంకే నేతలు ఎలాంటి స్పందిస్తున్నారు?
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఏంటంటే?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడ్డారంటూ అన్నామలై ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. తమిళనాడు గతంలో అనేక అవినీతి పరిపాలనలను చూసిందని, మాజీ ముఖ్యమంత్రులు అవినీతికి పాల్పడి కోర్టుల్లో కూడా శిక్షించబడ్డారని అన్నారు. అలాగే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారిందని అన్నారు. 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు)లో అవినీతి అత్యంత దారుణమైన స్థితిలో ఉందని అన్నామలై చెప్పారు. అవినీతిలో ఈ పీరియడ్ నంబర్ వన్ అని అన్నామలై అన్నారు. అయితే తమిళనాడు మాజీ సీఎం జయలలిత అవినీతి కేసులో కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ క్రమంలో అన్నామలై తమ 'ఇదయ దైవం' జయలలితపై పరోక్ష విమర్శలు చేశారని అన్నాడీఎంకే నిప్పులు చెరుగుతున్నారు.
కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా పని చేస్తున్న అన్నామలై: జయకుమార్
అన్నామలై కామెంట్స్ పై అన్నాడీఎంకే సీనియర్ నేత నేత డి.జయకుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ ఖండించకపోతే బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు పొన్ రాధాకృష్ణన్, తమిళిసై సౌందరరాజన్, మురుగన్ వంటి నేతలు పొత్తు ధర్మాన్ని పాటించారని, ఐక్యంగా ఉండేవారని, కానీ అన్నామలై మాత్రం బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. అన్నామలై చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఖండిస్తారని భావిస్తున్నట్లు జయకుమార్ అన్నారు. లేకుంటే పొత్తు కొనసాగడం ప్రశ్నార్థకం అవుతుందని జయకుమార్ చెప్పారు.
అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ ఏఐఏడీఎంకే తీర్మానం
అన్నామలై మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పరోక్ష ఆరోపణల నేపథ్యంలో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) కీలక నిర్ణయం తీసుకుంది. అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ తీర్మానం చేసింది. అన్నామలై పై ఏఐఏడీఎంకే కీలక నేత పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. జయలలితపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అపరిపక్వతను తెలియజేస్తోందని అన్నారు. అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి అన్నారు. అతను కావాలనే ఈ వాఖ్యలు చేసినట్లు పళనిస్వామి పేర్కొన్నారు. అతని కామెంట్స్ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని, ఇది ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించిందని చెప్పుకొచ్చారు.