
Trump tariff row: ట్రంప్ సుంకాలవేళ.. అమెరికా జీఈ కంపెనీతో భారత్ బిలియన్ డాలర్ల యుద్ధ విమాన ఇంజిన్ ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా కంపెనీ జీఈతో సుమారు ఒక బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందానికి భారత్ త్వరలోనే సంతకం చేయబోతున్నట్టు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది. ఇందులో భాగంగా స్వదేశీ యుద్ధవిమానాల కోసం మరో 113 జీఈ-404ఇంజిన్‌లను సరఫరా చేయనుంది. ఈ ఒప్పందం, అమెరికా భారత్‌పై కొత్త సుంకాలను విధించిన వేళ జరగడం విశేషం. ఆగస్టు 27 బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త చర్యలతో భారతీయ వస్తువులపై మొత్తం సుంక భారము దాదాపు 50శాతం చేరింది. ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) 83ఎల్సీఏ మార్క్ 1ఏ యుద్ధవిమానాల కోసం 99 జీఈ-404ఇంజిన్‌లను కొనుగోలు చేస్తూ అమెరికా జీఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజాగా మరో 113ఇంజిన్‌ల కొనుగోలు జరగనుందని ఏఎన్ఐ తెలిపింది.
వివరాలు
ఈ ఒప్పందం సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని సమాచారం
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.62 వేల కోట్ల విలువైన 97 ఎల్సీఏ మార్క్ 1ఏ యుద్ధవిమానాల కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వీటికి అవసరమైన ఇంజిన్‌ల కోసం జీఈతో చర్చలు దాదాపు తుది దశకు చేరాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ ఒప్పందం సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని సమాచారం. ఈ కొత్త ఒప్పందంతో HAL మొత్తం 212 జీఈ-404 ఇంజిన్‌ల అవసరాన్ని సజావుగా తీర్చుకునే అవకాశం ఉంది. తద్వారా ఇంజిన్ సరఫరాలో ఎలాంటి ఆలస్యం లేకుండా కొనసాగించవచ్చు. HAL 2029-30 నాటికి తొలి 83 విమానాలను, 2033-34 నాటికి మిగిలిన 97 విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు అందజేయాలని ప్రణాళిక వేసింది.
వివరాలు
జీఈ-414 ఇంజిన్‌ల కొనుగోలు కోసం HAL చర్చలు
అమెరికన్ జీఈ కంపెనీ ఇకపై నెలకు రెండు ఇంజిన్‌లు భారత్‌కు అందజేస్తూ తన బాధ్యతను నిర్వర్తించనుంది. మరోవైపు,జీఈ-414 ఇంజిన్‌ల కొనుగోలు కోసం HALచర్చలు జరుపుతోంది. వీటిలో 80 శాతం సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కే బదిలీ అవుతుంది. భారత వైమానిక దళానికి ఎల్సీఏ మార్క్ 2 విమానాల కోసం 162 ఇంజిన్‌లు,అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ఐదు ప్రోటోటైప్‌ల కోసం 10 ఇంజిన్‌లు అవసరం. మొత్తం 200 జీఈ-414ఇంజిన్‌లు కొనుగోలు చేయడానికి దాదాపు 1.5బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందం రాబోయే నెలల్లో ఖరారు కానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా వైమానిక దళంలోని మిగ్-21 యుద్ధవిమానాలను పూర్తిగా తొలగించి కొత్త యుద్ధవిమానాలతో భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
'స్వదేశీకి పెద్ద ఊతం'
స్వదేశీ యుద్ధవిమాన ప్రాజెక్టుకు రక్షణ మంత్రిత్వ శాఖ,ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ పూర్తి మద్దతు ఇస్తున్నాయి. ఇది స్వదేశీకరణకు పెద్ద ఊతం ఇవ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రక్షణ రంగంలో ఉన్న చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు కూడా పెద్ద ఎత్తున వ్యాపారం కల్పించనుంది. ఇకపై భారత్ స్వంతంగా యుద్ధవిమాన ఇంజిన్ అభివృద్ధి ప్రాజెక్టుపై కూడా పని చేస్తోంది. దీని కోసం ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని నిర్ణయించింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో భారత్ గ్లోబల్ కంపెనీల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సేకరిస్తోంది. ఇదిలావుండగా,ఆగస్టు 26న అమెరికా అదనంగా 25 శాతం సుంకం విధించనున్నసమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ"స్వదేశీ - మేక్ ఇన్ ఇండియా" పంథాను మరింతగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.