Amit Shah: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పై అమిత్‌షా కీలక వ్యాఖ్యలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' (జమిలి ఎన్నికలు) విధానంపై ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో స్పందించారు. ఈ విధానం కొత్తది కాదని, గతంలో కూడా భారత్‌లో ఇది అమలైందని ఆయన పేర్కొన్నారు. దేశంలో మూడు సార్లు జమిలి ఎన్నికలు నిర్వహించారని, 1952లో అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగినట్లు గుర్తుచేశారు. కేరళలో సీపీఐ(ఎం) ప్రభుత్వం విడిపోయిన తర్వాత ఈ విధానం అమలు కాలేదన్నారు. 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎన్నికల క్రమాన్ని మార్చిందన్నారు. ఆ తర్వాత నుంచి ఎన్నికలు వేర్వేరుగా జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
సమయం, ప్రజాధనం ఆదా అవుతుంది
ఇప్పుడు 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' విధానం ఆమోదం పొందిందని, ఈ విధానం దేశానికి లాభకరమని హోం మంత్రి చెప్పారు. తరచూ ఎన్నికలు నిర్వహించడం వల్ల సమయం, ప్రజాధనం వృథా అవుతోందన్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఈ రెండూ ఆదా అవుతాయని వెల్లడించారు. ఎక్కడైనా ప్రభుత్వాలు కూలిపోతే అక్కడ ఆ అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తామన్నారు. కేంద్ర కేబినెట్ ఈ 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును ఆమోదించిన కొద్ది గంటల్లో, అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసిన విషయం విశేషం. ప్రస్తుతం శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముందని సమాచారం.