Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'ప్రగతి', 'వికాస్' పేర్లతో రెండు ప్రత్యేక జనగణన చిహ్నాలను విడుదల చేశారు. స్త్రీ,పురుష జనగణకులను ప్రతిబింబించేలా ఈ చిహ్నాలను రూపకల్పన చేశారు. 2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో మహిళలు,పురుషులు సమానంగా భాగస్వామ్యం కావాలనే సందేశాన్ని ఈ చిహ్నాలు తెలియజేస్తాయని అధికారులు పేర్కొన్నారు. జనగణన-2027కు సంబంధించిన ముఖ్యమైన లక్ష్యాలు,సమాచారాన్ని సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు చేరవేయడంలో ఈ చిహ్నాలు ఉపయోగపడతాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. అలాగే 2027 జనాభా లెక్కలసేకరణకు సంబంధించిన వివరాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ప్రచారం చేయడానికి కూడా వీటిని వినియోగించనున్నారు.
వివరాలు
డిజిటల్ మ్యాపింగ్‌కు ఉపయోగపడే హౌస్‌లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్
ఇదిలా ఉండగా, ఈసారి జనగణన ప్రక్రియను మొదటిసారిగా డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) రూపొందించిన పలు డిజిటల్ సాధనాలను కూడా అమిత్ షా ఆవిష్కరించారు. ఉపగ్రహ చిత్రాల సహాయంతో డిజిటల్ మ్యాపింగ్‌కు ఉపయోగపడే హౌస్‌లిస్టింగ్ బ్లాక్ క్రియేటర్ (HLBC)ను విడుదల చేశారు. అలాగే గృహ జాబితాకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి అప్‌లోడ్ చేయడానికి ఉపయోగపడే 'హెచ్‌ఎల్‌ఓ' అనే ఆఫ్‌లైన్ మొబైల్ యాప్ను కూడా ప్రారంభించారు.
వివరాలు
సెన్సస్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్ విడుదల చేసిన అమిత్ షా
ఇక ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా సమర్పించుకునేలా 'సెల్ఫ్ ఎన్యూమరేషన్ (SE)' పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా జనగణన కార్యక్రమం పర్యవేక్షణను సులభతరం చేసే సెన్సస్ మేనేజ్‌మెంట్ మానిటరింగ్ సిస్టమ్ను కూడా అమిత్ షా విడుదల చేశారు. జనగణనలో మొదటి దశ అయిన హౌస్ లిస్టింగ్ మరియు హౌసింగ్ సెన్సస్ వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. రెండో దశగా జరిగే జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం 2027 ఫిబ్రవరిలో ప్రారంభమై, మార్చి 1 అర్ధరాత్రి 12 గంటలలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.