CRS Application : సీఆర్ఎస్ యాప్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఎలా పని చేస్తుందంటే?
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెన్సస్ బిల్డింగ్‌లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్) యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ప్రజలు ఎక్కడి నుంచైనా జనన మరణాల నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పనిని ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లోనే సులభంగా పూర్తి చేసుకునే వీలుండటంతో, ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం, క్యూలలో నిలబడడం వంటి ఇబ్బందులు తప్పనున్నాయి. సెన్సస్ ఇండియా 2021 సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ యాప్ వినియోగంపై స్పష్టమైన వివరాలు అందించారు. పుట్టిన, మరణించిన తేదీ నుండి 21 రోజులలోపు ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా నమోదు చేయాలంటే, 22-30 రోజుల్లో రూ. 2, 31 రోజుల నుండి ఏడాదిలోపు రూ. 5 ఆలస్య రుసుము చెల్లించాలి.
జనన మరణాల రేటు ను ఎక్కడినుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు
పాత సర్టిఫికెట్‌లకు రూ. 10 రుసుము నిర్ణయించారు.ఇది గరిష్ట రుసుముగా ఉంటుంది. ఈ అంశంపై అమిత్ షా మాట్లాడారు. ప్రజలు తమ రాష్ట్ర అధికారిక భాషలో ఎక్కడి నుంచైనా జనన మరణాల రిజిస్ట్రేషన్ చేయవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు సౌకర్యవంతమైన ఈ యాప్ జనన మరణాల రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు. జనాభా గణన ప్రక్రియలో సమాచారాన్ని సేకరించేందుకు మొబైల్ అప్లికేషన్లు కూడా ఉపయోగంలోకి తీసుకొస్తున్నామని అమిత్ షా తెలిపారు. తొలిసారిగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్‌పీఆర్) సృష్టించనున్నట్లు ప్రకటించారు. ఇది శాంతిభద్రతలను మెరుగుపరచడంలో, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జనాభా గణన ప్రారంభ తేదీ, ఫార్మాట్ తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.