Amith Sha-Press Meet-Hyderabad: మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పుల పాలైంది: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
మిగులు బడ్జెట్ రాష్ట్రమైన తెలంగాణ (Telangana)ను గత పాలకులు అప్పుల పాలు చేశారని కేంద్ర హోమంత్రి అమిత్ షా (Amith shaw) మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరోసారి కేంద్రంల అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణలో బలం పుంజుకున్నామని, ఈ ఎన్నికల్లో బీజేపీ (BJP) 10 సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో ఎక్కడా ఉగ్రదాడులు లేవని తెలిపారు. తెలంగాణకు రామగుండం ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ సంస్థను నిర్మించి ఇచ్చామని, సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని మంజూరు చేశామని తెలిపారు. ఇవిగాక ఇంకా ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలను తెలంగాణకు ఇచ్చామని వివరించారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది: అమిత్ షా
ఇక తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలన నడుస్తోందని అమిత్ షా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయడం లేదని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ దుష్ర్పచారం చేస్తుందని మండిపడ్డారు.