అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా.. ప్రజలకు మోదీ సర్కార్ పై సంపూర్ణ విశ్వాసం
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. మోదీ సర్కారు పట్ల ప్రజలు పూర్తి నమ్మకంతో ఉన్నారని, అవిశ్వాసానికి ప్రజల మద్దతు లేదని షా తెలిపారు. తమ ప్రభుత్వం మైనార్టీలో లేదని, ఇలాంటి సందర్బాల్లోనే విపక్షాల బలమెంతో తెలుస్తుందన్నారు. ప్రధానిగా మోదీ పలు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఆగస్ట్ 9న మహాత్ముడు క్విట్ ఇండియా నినాదం ఎత్తుకున్నారని, ఇప్పుడు మళ్లీ మోదీ అదే క్విట్ I.N.D.I.A. నినాదాన్ని ఇస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు, సభకు సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రజల ఆలోచనలు మళ్లించేందుకేనని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఇప్పటి వరకు 27 అవిశ్వాస తీర్మానాలు వచ్చినట్లు షా చెప్పారు.
నిజాయితీపరులం కాబట్టే ఒక్క ఓటుతో ఆనాడు ప్రభుత్వం పడిపోయింది : షా
పీవీ హయాంలో అవిశ్వాసం పెట్టినప్పుడు గెలిచినా, తర్వాత కాంగ్రెస్ నేతలు జైలుకెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు. మరోవైపు డబ్బులిచ్చి అవిశ్వాసాన్ని గెలిచారనే ఆరోపణలు వచ్చాయనే అంశాన్ని షా ప్రస్తావించారు. వాజపేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టారని, కానీ తాము నిజాయితీగా వ్యవహరించినట్లుగా చెప్పుకొచ్చారు. దాని ఫలితంగానే ఒకే ఒక్క ఓటుతో తమ ప్రభుత్వం పడిపోయిందన్నారు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందు ఉందని షా అన్నారు. తాము తాయిలాలు పంచబోమని, రుణమాఫీలపై తమకు నమ్మకం లేదని వివరించారు. రైతులెవ్వరు రుణాలు తీసుకోకుండా సాగుకు తామే సాయం అందిస్తున్నామన్నారు.యూపీఏ రూ.70 వేలకోట్ల రుణమాఫీ తాయిలాలు ఇచ్చిందన్నారు. డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో భాగంగా డబ్బులు జమ అవుతున్నాయని షా పేర్కొన్నారు.