లోక్‌సభలో ఎంపీ నామా కీలక వ్యాఖ్యలు..కేంద్ర సహకారం లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతోంది
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా భారాస ఎంపీ నామా నాగేశ్వరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు.
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల ఏర్పాటు కోరుతూ ఇప్పటికే చాలా సార్లు లేఖలు రాసినా ప్రయోజనం రాలేదన్నారు.
UPA హయాంలో మంజూరైన ITIR ప్రాజెక్టును ఎన్డీఏ సర్కారు రద్దు చేసిందన్నారు. భారతదేశంలో తెలంగాణ కూడా భాగమే కదా అని ప్రశ్నించారు.
హర్ ఘర్ జల్ ఫథకం కింద కేంద్రం అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తోందని, కానీ తెలంగాణలో మాత్రం ఇంటింటికీ రాష్ట్ర ప్రభుత్వమే తాగునీరు ఇస్తోందన్నారు.
మరోవైపు సాగు కోసం 24 గంటల విద్యుత్ ఇస్తోంది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాన్ని అధిగమించిందన్నారు.
DETAILS
నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా రూపాయి కూడా ఇవ్వలేదు : నామా
రాష్ట్రానికి రూ.24 వేల కోట్లివ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా రూపాయి కూడా మంజూరు చేయలేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినా స్పందన లేదన్నారు.
కోచ్ ఫ్యాక్టరీలను మహారాష్ట్ర, గుజరాత్‌కు ఇచ్చి తెలంగాణకు రిపేర్ చేసుకునే ఫ్యాక్టరీలను ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరితే అదీ ఇవ్వలేదన్నారు.
తెలంగాణకు మెడికల్ కళాశాలలు, నవోదయ విద్యాలయాలు ఇవ్వట్లేదు. కేంద్రం సహకరించకపోయినా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోంది.
చిన్న రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించట్లేదని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని నామా విజ్ఞప్తి చేశారు.