పాల ధరలు పెంచిన 'అమూల్', లీటరుపై రూ.3 వడ్డన
గుజరాత్ డెయిరీ కోఆపరేటివ్ అమూల్ పాల ధరలను మరోసారి పెంచింది. అన్ని రకాల పాల ప్యాకెట్ ధరలను లీటరు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ధరలు నేటి నుంచి( ఫిబ్రవరి 3వ తేదీ) అమల్లోకి వస్తాయని తెలిపింది. 'అమూల్ తాజా' పాలు అర లీటరు రూ. 27, లీటరు రూ. 54, అమూల్ గోల్డ్ మిల్క్ హాఫ్ లీటర్ రూ. 33, లీటర్ రూ. 66, అమూల్ ఆవు పాలు అర లీటరు రూ. 28, లీటర్ రూ. 56, గేదె పాలు అర లీటరు 35, ఒక లీటరు రూ.70కు లభించనున్నాయి. ఈ ధరలకు డిస్ట్రిబ్యూటర్ ఛార్జీలు అదనం కానున్నాయి.
నిర్వాహణ ఖర్చులు పెరగడమే కారణం: అమూల్
2022లో అమూల్ పాల ధరలను మూడుసార్లు పెంచింది. మార్చిలో ఒకసారి, తర్వాత ఆగస్టులో పెంచింది. అక్టోబర్‌లో సైతం రెండు రూపాయలను అమూల్ పెంచింది. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) తన పాల ఉత్పత్తులను అమూల్ బ్రాండ్‌తో మార్కెట్ చేస్తుంది. మొత్తం నిర్వహణ వ్యయం, పాల ఉత్పత్తి వ్యయం పెరగడం వల్ల ఈ ధరలను పంచాల్సి వచ్చిందని అమూల్ సంస్థ పేర్కొంది. ఈ మధ్య కాలంలో ఒక్క పశువుల దాణా ఖర్చే దాదాపు 20 శాతానికి పెరిగిందని వెల్లడించింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దిల్లీకి చెందిన మదర్ డెయిరీ పాల ధరలను పెంచినా, ఆ సమయంలో అమూల్ మాత్రం పెంచకపోవడం గమనార్హం.