ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని శ్రీరామనవమి సందర్భంగా బేలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో బావి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. బావిని కప్పడానికి ఇనుప రాడ్లతో కాంక్రీట్ స్లాబ్ వేసి బావి పైకప్పును నిర్మించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో భక్తులు ఒక్కసారి బావి పై కప్పు మీదకు రావడంతో.. కాంక్రీట్ స్లాబ్ కూలిపోయింది. ఇప్పటివరకు 35 మృతదేహాలను వెలికితీసినట్లు ఇండోర్ డివిజన్ కమిషనర్ పవన్ శర్మ వెల్లడించారు. మరో 18 మందిని రక్షించినట్లు తెలిపారు.
ఆలయంలో ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం
75 మంది ఆర్మీ సిబ్బందితో సహా 140 మంది బృందం రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటోంది. మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండోర్ డివిజన్ కమిషనర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆలయంలో జరిగిన ప్రమాదంపై స్పందించారు. మృతుల పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు. సీఎం శివరాజ్ చౌహాన్‌తో మాట్లాడి పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బావిపై ఆలయ నిర్మాణానికి ఎలా అనుమతి ఇచ్చారనే వివరాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన ప్రకటించారు.