Loading...
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారి ఏం చేశారంటే?
రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారి ఏం చేశారంటే?

Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారి ఏం చేశారంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు. అంతేకాదు.. రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసి, వచ్చిన భిక్షతోనే భోజనం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో, ప్రజల్లో చర్చకు దారితీశాయి. మనం మాట్లాడుతున్నది మహారాష్ట్రలోని ఘాట్‌కోపర్ ఈస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే పరాగ్ షా గురించి. సామాజిక, ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందాలనే ఉద్దేశంతో ఆయన బిచ్చగాడి వేషం ధరించి ప్రజల్లోకి వెళ్లారు. సాధారణ వ్యక్తిలా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ఆయనను మేకప్, వేషధారణ కారణంగా చాలామంది గుర్తించలేకపోయారు.

వివరాలు

గురువు సూచనతో బిచ్చగాడిగా మారిన ఎమ్మెల్యే

సమాచారం ప్రకారం.. జైన మతంలో జరిగే చాతుర్మాస కార్యక్రమాల సందర్భంగా పరాగ్ షా తన గురువు నమ్రముని సూచన మేరకు ఈ ప్రయోగం చేశారు.

పేదవాడి జీవితాన్ని, అతడు ఎదుర్కొనే పరిస్థితులను దగ్గరగా అర్థం చేసుకోవాలంటే ఒకరోజు బిచ్చగాడిగా జీవించాలని గురువు సూచించినట్లు తెలుస్తోంది.

దీంతో పరాగ్ షా తన సాధారణ భద్రతా సిబ్బంది, ఇతర సౌకర్యాలకు దూరంగా ఉన్నారు. మేకప్ సహాయంతో బిచ్చగాడి వేషం ధరించి అనంతరం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజలను కలిశారు.

వారి నుంచి భిక్ష స్వీకరించడంతో పాటు.. అదే ఆహారంతో భోజనం చేశారు. ఈ అనుభవం పూర్తయిన తర్వాత తన అసలు పరిచయాన్ని వెల్లడించి అక్కడి ప్రజలతో మాట్లాడారు.

వివరాలు

సామాజిక చర్చకు దారితీసిన ఘటన

తాను బిచ్చగాడి వేషంలో ఉన్నప్పుడు ఎదుర్కొన్న అనుభవాలను, ప్రజల నుంచి ఎదురైన స్పందనను వారితో పంచుకున్నారు.

పరాగ్ షా చేసిన ఈ ప్రయోగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొందరు దీనిని ఆయన వ్యక్తిగత, ఆధ్యాత్మిక అనుభవంగా చూస్తున్నారు.

మరికొందరు సమాజంలోని పేదవర్గాల జీవన పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు.

అయితే ఒక వ్యక్తి జీవితంలోని కష్టాలను కేవలం కొన్ని గంటలు లేదా ఒకరోజు అనుభవించడం ద్వారా పూర్తిగా అర్థం చేసుకోవచ్చా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

ఈ కారణంగానే పరాగ్ షా బిచ్చగాడిగా మారిన ఘటన కేవలం వ్యక్తిగత అనుభవానికే పరిమితం కాకుండా.. సామాజిక చర్చకు కూడా దారితీస్తోంది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరలవుతున్న వీడియో ఇదే

ADVERTISEMENT