
Hyderabad: లంచం తీసుకొని చెత్త డబ్బాలో దాచిన ఎస్సై.. ఏసీబీకి అడ్డంగా దొరికాడు!
ఈ వార్తాకథనం ఏంటి
శామీర్‌పేట ఎస్సై ఎం. పరశురాం లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) చేతికి చిక్కాడు.
వివరాల్లోకి వెళితే.. అనిశా డీఎస్పీ శ్రీధర్ వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ నెల 15న శామీర్‌పేట పరిధిలో ఓ కిరాణా దుకాణానికి తీసుకొస్తున్న వాహనం నుంచి రూ.2.42 లక్షల విలువైన నూనె డబ్బాలు చోరీకి గురయ్యాయి.
దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తులో సూర్య, అఖిలేశ్ అనే ఇద్దరు నూనె డబ్బాలు దొంగలించినట్లు తేలింది. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ కొనసాగించారు.
ఈ కేసులో నూనె డబ్బాలు కొనుగోలు చేసిన మరో వ్యక్తి పాత్రను గుర్తించిన ఎస్సై పరశురాం, ఆ వ్యక్తిని ఈ నెల 20న పోలీస్ స్టేషన్‌కు రప్పించాడు.
Details
వేధింపులు అధికం కావడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
అతడిని బెదిరించి, కేసు నుంచి తప్పించాలంటే రూ.2 లక్షలు లంచంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. భయంతో బాధితుడు మరుసటి రోజే ఎస్సై కారులో రూ.2 లక్షలు పెట్టి ఇచ్చేశాడు.
అయితే పరశురాం ఆ తరువాత మళ్లీ ఫోన్ చేసి, ఇచ్చిన డబ్బులో తక్కువ ఉందని పేర్కొంటూ రూ.25 వేల అదనపు డిమాండ్ చేశాడు. చివరికి రూ.22 వేలకు అంగీకరించాడు.
వేధింపులు అధికమవడంతో బాధితుడు ఈ నెల 23న ఏసీబీని ఆశ్రయించాడు.
Details
పరుశురాంను రిమాండ్ కు తరలించిన డీఎస్పీ
ఏసీబీ అధికారులు ఏర్పాటు చేసిన పథకం ప్రకారం సోమవారం మధ్యాహ్నం బాధితుడు రూ.22 వేల రూపాయలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎస్సై సూచన మేరకు టేబుల్ పక్కనున్న చెత్త డబ్బాలో డబ్బులు వేసి బయటకు వచ్చాడు.
వెంటనే ఏసీబీ అధికారులు లోపలికి దూసుకెళ్లి పరశురాంను లంచం డబ్బుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
డబ్బును స్వాధీనం చేసుకుని, పరశురాంను రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు.