Andhra Pradesh: అనంతపురంలో ఆపిల్ సాగు.. ఆపిల్ సాగులో రైతు విజయగాథ
ఈ వార్తాకథనం ఏంటి
అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగులో రైతులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. జిల్లాలోని సిండికేట్‌నగర్‌కు చెందిన రైతు రమణారెడ్డి ఆపిల్ సాగులో విజయాన్ని అందుకున్నారు. మర్తాడు గ్రామంలో ఉన్న తన రెండున్నర ఎకరాల పొలంలో మూడు సంవత్సరాల క్రితం వివిధ రకాల ఆపిల్ మొక్కలను నాటారు. అయితే ప్రాంతీయ ఉష్ణోగ్రతలు అనుకూలించక తొలి ప్రయత్నంలో దిగుబడులు రాలేదు.
వివరాలు
ఒక్కో మొక్కకు రూ.650 ఖర్చు
అయినప్పటికీ ఆయన వెనకడుగు వేయకుండా కొత్త మార్గాలను అన్వేషించారు. విదేశంలో ఉన్న తన స్నేహితుడి సూచనతో కేఎల్‌డీ రకం ఆపిల్ మొక్కలను 2024 అక్టోబరులో తెప్పించి మళ్లీ సాగు ప్రారంభించారు. ఒక్కో మొక్కకు రూ.650 ఖర్చు చేసి మొత్తం 1,500 మొక్కలను నాటారు. ఈ మొక్కలు 45 డిగ్రీల వరకు ఉన్న ఎండను తట్టుకొని పెరిగాయి. ఇటీవల పది రోజుల కిందట పండిన ఆపిల్ దిగుబడిలో ఒక టన్నును ఒక లక్ష యాభై వేల రూపాయలకు బెంగళూరులోని ఒక వ్యాపార కేంద్రం కొనుగోలు చేసినట్లు రైతు తెలిపారు.