LOADING...
Andhra News: 3.47లక్షలకే సొంతిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఈ నెల 30 వరకు గడువు
ఈ నెల 30 వరకు గడువు

Andhra News: 3.47లక్షలకే సొంతిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఈ నెల 30 వరకు గడువు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఇల్లులేని వారా? అయితే మీకు మంచి అవకాశం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గ్రామీణ పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ)-ఎన్టీఆర్ పథకం క్రింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసి దాని ద్వారా ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 30వ తేదీతో గడువు పూర్తవుతుంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రత్యేక డ్రైవ్‌లో సుమారు 3.47లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. గతంలో పట్టణాభివృద్ధి సంస్థలు (యూడీఏ) పరిధిలో పీఎంఏవై (అర్బన్)పథకం అమలులో ఉండగా, కొన్ని రాష్ట్రాలు కేవలం ఇళ్ల నిర్మాణ అనుమతులు పొందేందుకు గ్రామీణ ప్రాంతాలను యూడీఏలుగా మార్చుతుండటంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.

వివరాలు 

సొంత స్థలమున్నా.. లేకపోయినా 

అందుకే ఆ అనుమతులను నిలిపివేసి, యూడీఏలు పరిధిలో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ ప్రాంతాల్లోనూ అర్హుల ఎంపిక జరుగుతోంది. గ్రామీణ గృహ నిర్మాణంలో ప్రభుత్వం రెండు విధాలుగా సహాయం చేస్తోంది. సొంత స్థలం ఉన్నవారు: తమ స్థలంపైనే ఇల్లు కట్టేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందుతుంది. సొంత స్థలం లేని వారు: గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు కేటాయించి ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేలా పథకం నుంచి ఇల్లు మంజూరు చేస్తారు. సొంత స్థలమున్న, స్థలం లేని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

వివరాలు 

పక్కాగా లబ్ధిదారుల ఎంపిక 

ఈ పథకంలో ఎంపిక ప్రక్రియ కచ్చితంగా పారదర్శకంగా ఉండేందుకు కేంద్రం 'ఆవాస్+' అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. గ్రామ-వార్డు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణశాఖ ఏఈలు అర్హుల గుర్తింపు బాధ్యతను తీసుకున్నారు. వారు దరఖాస్తుదారుల ప్రస్తుత నివాసం, లొకేషన్ ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. కొత్తగా ఇల్లు కట్టే స్థలానికీ ఫోటో తీస్తారు. దరఖాస్తుదారుని ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే, ముఖ గుర్తింపుతో ఆధార్ వివరాలు స్వయంగా కనిపిస్తాయి. జాబ్‌కార్డు వివరాలు కూడా నమోదు చేస్తారు.

వివరాలు 

జిల్లాల వారీగా దరఖాస్తుల స్పందన 

రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇప్పటివరకూ అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యధిక దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉండగా, విశాఖపట్టణం జిల్లా నుంచి అత్యల్ప సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అత్యంత పేదలకు తొలి అవకాశం ఈ పథకంలో అత్యంత పేదలకే మొదటి ప్రాధాన్యం దక్కేలా యాప్‌ రూపొందించారు. యాప్‌లో నమోదైన వివరాల ఆధారంగా అర్హుల జాబితా సిద్ధమవుతుంది. ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రం సేకరించిన వివరాలను కేంద్రానికి పంపుతుంది. అక్కడ మరోసారి పరిశీలన జరుగుతుంది. చివరగా ఆమోదించిన జాబితా ఆధారంగానే ఇళ్ల మంజూరు జరుగుతుంది.