LOADING...
Weather Alert: ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు..తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్
ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్

Weather Alert: ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు..తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 28, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండగా, తెలంగాణలో సాయంత్రం సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రెండు రాష్ట్రాల వాతావరణంపై వాతావరణ శాఖ తాజా సమాచారం వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం తెలంగాణలో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులు, హెచ్చరికలు ప్రకటించింది.

వివరాలు 

రాబోయే మూడు రోజులలో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఈరోజు సముద్రమట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. ఇదే సమయంలో నిన్న మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం నుంచి కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించిన ద్రోణి, ఈరోజు ఉత్తర తెలంగాణలో ఏర్పడిన ఆవర్తనం నుంచి అంతర్గత కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. రాబోయే మూడు రోజులలో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దగా మార్పులేకుండా ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వడగాలులు వీచే అవకాశముంది. అలాగే మూడు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండగా, అక్కడక్కడ వర్షాలు పడవచ్చు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని తెలిపారు.

Advertisement

వివరాలు 

ఈ ప్రాంతాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయంలో పొలాల్లో పని చేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడకూడదని అధికారులు హెచ్చరించారు.

Advertisement