Chandrababu: గ్రీన్ ఎనర్జీ పెట్టుబడుల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్.. దావోస్‌లో చంద్రబాబు ప్రసంగం
ఈ వార్తాకథనం ఏంటి
దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భారతీయుల వ్యాపార ప్రతిభను ప్రశంసించారు.
సీఐఐ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతీయుల రక్తంలోనే వ్యాపార లక్షణాలు ఉన్నాయని, ప్రపంచ దేశాలకు భారతీయులు అత్యుత్తమ సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు.
భవిష్యత్తులో తన కలలు నిజమవుతాయని నమ్మకం పెరిగిందని, గత రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దామని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
బిల్ గేట్స్ ఐటీ సేవలు అందించడం, 1991లో ఆర్థిక సంస్కరణల ప్రవేశం వంటి చర్యలను ఉపయోగించి కొత్త సంస్కరణలను తీసుకువచ్చామని ఆయన గుర్తు చేశారు.
Details
ఇంటింటికీ సౌర విద్యుత్ ఉత్పత్తి
విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం వల్ల తాను ఓటమి ఎదుర్కొన్నా ప్రస్తుతం అవే విధానాలు ప్రజలకు ప్రయోజనకరంగా మారాయని తెలిపారు.
2014లో సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత సౌర విద్యుత్‌పై దృష్టి పెట్టినట్లు చంద్రబాబు తెలిపారు.
పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటింటికీ సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, పవన విద్యుత్ ఉత్పత్తికి దారులు వేస్తున్నామన్నారు. 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఇంధన వనరుల్లో వస్తుండగా, 500 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
21 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో కలిసి గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేపట్టనున్నట్లు చెప్పారు.
Details
ఈవీ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సహకాలు
ఏపీని గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు తీరప్రాంతం, రవాణా సదుపాయాలు, పోర్టుల వంటి అవకాశాలను వినియోగించుకోవాలని చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు సూచించారు.
ఈవీ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని రక్షిస్తూ ప్రజలకు తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించాలన్న సంకల్పాన్ని పంచుకున్నారు.
ఆర్గానిక్ వ్యవసాయం, గ్లోబల్ కమ్యూనిటీ కోసం ఏపీని ఒక మంచి మోడల్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
భారతీయుల ప్రతిభ ప్రపంచంలో అందరికీ స్ఫూర్తిదాయకమని, ఏపీ పారిశ్రామికవేత్తలు ఎక్కడికెళ్లినా కనిపిస్తుండటం గర్వకారణమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, దీని సాయంతో ఏపీ మరింత అభివృద్ధి సాధిస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.