Andhrapradesh: ఫిబ్రవరి 5 నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5న ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సెషన్ ప్రారంభమవుతుంది. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే జరిగే అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ ఎన్ని రోజులు సెషన్‌ను నిర్వహించాలో, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌తో సహా సభా వ్యవహారాలను నిర్ణయిస్తుంది. సంక్షేమ ఎజెండాపై దృష్టి సారించేలా బడ్జెట్ మూడు నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ దాదాపు రూ.75,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈసారి బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటే అవకాశం
ఎన్నికల సమీపిస్తున్న సమయం కాబట్టి , బడ్జెట్‌లో ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరుతున్నారు. బుధవారం ఇక్కడ సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కూడా ఫిబ్రవరి 5 నుండి బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్నందున, సమావేశాన్ని క్లుప్తంగా నిర్వహించాలని ప్రభుత్వం కోరుతోంది. అందుకే మూడు నుండి ఐదు రోజులకు పరిమితం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.91 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈసారి బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల మార్కును దాటే అవకాశం ఉందని, ఎన్నికల తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే దీనిని సమర్పిస్తామన్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలు
సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి సారించిన సీఎం బడ్జెట్ ను ప్రజలకు చూపి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నామని, ప్రజలు తనకు మరోసారి అవకాశం ఇస్తారని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే ఉంటాయి.