Andhra Pradesh: ఇక 'డిజిటల్ హౌస్‌గా 'ఏపీ అసెంబ్లీ.. వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచే అమలుకు అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ శాసనసభ త్వరలో పూర్తిస్థాయిలో డిజిటల్ విధానంలోకి మారనుంది. కాగితాల వినియోగం లేకుండా అసెంబ్లీ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే బడ్జెట్ సమావేశాల నుంచే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ వెల్లడించారు. జాతీయ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA) ప్రాజెక్టులో భాగంగా పార్లమెంట్‌తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభల కార్యకలాపాలను డిజిటల్ రూపంలోకి తీసుకెళ్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) అమలు చేస్తోంది. ఈ ప్రాజెక్టు అమలుకు సంబంధించి 2024 నవంబరులో ఏపీ అసెంబ్లీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మధ్య ఒప్పందం కుదిరింది.
వివరాలు
బడ్జెట్ సమావేశాలకు ముందే మాక్ అసెంబ్లీ
మొత్తం రూ.23.58 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన నెవా ప్రాజెక్టు అమలులో తొలుత పలు సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురయ్యాయి.
వాటిని అధిగమించిన తర్వాత సుమారు నాలుగైదు నెలల క్రితమే పనులు వేగం పుంజుకున్నాయి.
కొత్త డిజిటల్ విధానం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు రాబోయే బడ్జెట్ సమావేశాల్లోగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి నమూనా బిల్లులను ఆన్‌లైన్‌లో పంపిస్తారు.
సభ్యులు అడిగినట్లుగా డమ్మీ ప్రశ్నలను కూడా వ్యవస్థలో అప్‌లోడ్ చేసి, మొత్తం ప్రక్రియను పరీక్షిస్తారు.
తొలిదశలో లెజిస్లేషన్, క్వశ్చన్స్, రిపోర్టింగ్ మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివరాలు
ఆన్‌లైన్‌లో అందుబాటులో..
ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఏపీ అసెంబ్లీకి చెందిన 15 మంది అధికారులు దిల్లీకి వెళ్లి శిక్షణ తీసుకున్నారు.
తొలిదశ అమలు పూర్తయిన తర్వాత కమిటీ, రిసెప్షన్ మాడ్యూల్స్‌ను కూడా ఇందులో చేర్చనున్నారు.
ముఖ్యంగా రిపోర్టింగ్ మాడ్యూల్ ద్వారా సభలో సభ్యులు చేసిన ప్రసంగాలు, వారు మాట్లాడిన పూర్తి వివరాలు టెక్స్ట్ రూపంలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
వివరాలు
ట్యాబ్‌లలోనే ప్రశ్నలు పంపే అవకాశం
ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ ప్రశ్నలను కాగితాలపై రాసి అసెంబ్లీకి పంపాల్సి వచ్చేది.
ఇకపై ఆ అవసరం ఉండదు. సభ్యులకు అందించే ట్యాబ్‌లలోనే ప్రశ్నలను టైప్ చేసి నేరుగా ఆన్‌లైన్‌లో అసెంబ్లీకి పంపవచ్చు.
సభ్యుల నుంచి అందిన ప్రశ్నలను అసెంబ్లీ సిబ్బంది పరిశీలించి, సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపిస్తారు.
ఆయా శాఖల్లోని నోడల్ అధికారులు ప్రశ్నలకు సమాధానాలను సిద్ధం చేయిస్తారు.
సంబంధిత శాఖ మంత్రి ఆమోదం తీసుకున్న తర్వాత సమాధానాలను తిరిగి అసెంబ్లీకి పంపిస్తారు.
ఆ తర్వాత స్పీకర్ అనుమతి పొందిన ప్రశ్నలు, సమాధానాలను సభ్యులకు అందజేస్తారు. ఈ ప్రక్రియలోని ప్రతి దశ ఆన్‌లైన్‌లోనే కొనసాగుతుంది.
ప్రభుత్వ శాఖలు కూడా బిల్లులను ఇదే డిజిటల్ విధానం ద్వారా అసెంబ్లీకి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వివరాలు
సభ్యుల సీట్ల వద్ద ప్రత్యేక డిస్‌ప్లేలు
డిజిటల్ విధానంలో భాగంగా శాసనసభ, శాసనమండలిలో ప్రతి సభ్యుడి సీటు వద్ద ప్రత్యేక డిస్‌ప్లేలను ఏర్పాటు చేయనున్నారు.
సభలో ప్రవేశపెట్టే బిల్లులు, నివేదికలు తదితర పత్రాలన్నీ ఈ స్క్రీన్లపై కనిపిస్తాయి.
చర్చల సమయంలో ఇతర సభ్యులు మాట్లాడే అంశాల్లో ముఖ్యమైన పాయింట్లను రాసుకునేందుకు వీలుగా ప్రత్యేక స్క్రిబ్లింగ్ ప్యాడ్ సౌకర్యం కూడా కల్పించనున్నారు.
ఈ ఏర్పాట్ల కోసం ఉభయ సభల్లో అవసరమైన విద్యుత్ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ప్రస్తుతం సభ్యుల సీట్ల వద్ద డిస్‌ప్లే మానిటర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
అవి అందుబాటులోకి వస్తే సభలో జరిగే కార్యకలాపాలను సభ్యులు తమ సీట్ల నుంచే డిజిటల్ రూపంలో పరిశీలించుకోవచ్చు.
వివరాలు
అధికారులకు దశలవారీగా శిక్షణ
నెవా ప్రాజెక్టు అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అసెంబ్లీలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు అసెంబ్లీకి చెందిన 150 మంది,సచివాలయానికి చెందిన మరో 120 మంది అధికారులకు ఈ విధానంపై అవగాహన కల్పించారు.
అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 450 మంది సెక్షన్ ఆఫీసర్లకు (ఎస్‌ఓ) కూడా శిక్షణ ఇచ్చారు.
వివరాలు
అధికారులకు దశలవారీగా శిక్షణ
వీటితో పాటు మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులు (పీఎస్‌లు),శాఖల కార్యదర్శుల నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఉన్నతాధికారుల వ్యక్తిగత కార్యదర్శులకు కూడా నెవా విధానంపై వివరించారు.
తదుపరి దశలో ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం వచ్చే వారంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ఏర్పాట్లన్నీ పూర్తయితే ఏపీ అసెంబ్లీలో బిల్లుల ప్రవేశపెట్టడం, ప్రశ్నలు పంపడం, సమాధానాలు అందించడం, నివేదికలు పరిశీలించడం వంటి కీలక కార్యకలాపాలన్నీ డిజిటల్ రూపంలోనే సాగనున్నాయి.