
Andhra News: రాష్ట్రవ్యాప్తంగా 1,350 కొత్త బస్సులు.. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల కోసం మొత్తం 1,350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, వాకాడు ప్రాంతాల్లో ఉన్న ఆర్టీసీ డిపోలు, బస్టాండ్లను అయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు 750 కొత్త బస్సులకు అనుమతులు లభించాయని తెలిపారు. మిగిలిన 600 బస్సుల కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచినట్లు వెల్లడించారు. ఆగస్టు నెల నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రతి బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం తాగునీటి సదుపాయం
అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని మొత్తం 11,000 బస్సుల్లో 74 శాతం బస్సులను ఈ ఉచిత ప్రయాణ సేవల కోసం ప్రత్యేకంగా కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ సేవలు ప్రస్తుత జిల్లాల వరకే పరిమితంగా ఉన్నప్పటికీ,ఇకపై ఉమ్మడి జిల్లాలకు కూడా ఈ ప్రయోజనాన్ని విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రాబోయే రెండు నెలల్లో తాగునీటి సదుపాయం, కూర్చునేందుకు కుర్చీలు, వేడికీ చల్లదనానికీ ఫ్యాన్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పల్లెవెలుగు బస్సుల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. అంతేగాక ఆర్టీసీలో పని చేస్తున్న అన్ని స్థాయి ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పించనున్నట్లు ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టంచేశారు.