
AndhraPradesh: ఏపీలో చేపల వేటపై నిషేధం రెండు నెలల పాటూ వేట బంద్
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీలో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది.ఈ నెల 15 నుంచి జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది.
ఈ కాలంలో సముద్ర జీవులు,ముఖ్యంగా చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి.
వాటి వృద్ధికి సహాయపడేలా మోటార్ బోట్లు,ఇంజిన్ బోట్లను వేటకు అనుమతించరు.
అయితే కేవలం చిన్న స్థాయి కర్ర తెప్పల వేటకు మాత్రం పరిమిత అనుమతులు ఉన్నాయి.
నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.
ఈ రెండు నెలల నిషేధ కాలంలో మత్స్య శాఖ అధికారులు మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూస్తారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు.
వివరాలు
'మత్స్యకార భరోసా'
అంతేకాదు, ప్రభుత్వ పథకాల లబ్ధి నుంచి కూడా వారిని బహిష్కరిస్తారు. అందువల్ల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.
వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు ప్రభుత్వం భరోసాగా నిలుస్తోంది.
గతంలో 40 రోజుల పాటు వేట నిషేధం అమలులో ఉండేది. తర్వాత దానిని 60రోజుల వరకు పెంచారు.
ఆ కాలంలో మత్స్యకారులకు బియ్యాన్ని ఉచితంగా అందించేవారు.ఆ తరువాత ఈ పథకం 'మత్స్యకార భరోసా'గా మారింది.
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉచిత బియ్యం స్థానంలో ప్రతి అర్హత కలిగిన మత్స్యకారునికి రూ.2,000 ఆర్థిక సాయం ఇవ్వడం ప్రారంభించారు.
తరువాత దీనిని రూ.4,000కి పెంచారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ భరోసా మొత్తాన్ని రూ.10,000కు పెంచారు.
వివరాలు
లబ్ధిదారులను గుర్తించేలా సర్వే
ఎన్నికల నేపథ్యంలో, తాము అధికారంలోకి వస్తే మత్స్యకారులుకు చేపల వేట నిషేధ కాలంలో ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి హామీ ఇచ్చింది.
ఆ హామీ మేరకు ఈ సంవత్సరపు బడ్జెట్‌లో తగిన నిధులను కూడా కేటాయించారు.
ప్రస్తుతం మే నెల లేదా ఈ నెలలోనే ఈ సహాయం మత్స్యకారులకు అందుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
అయితే, ఈ పథకం అమలుకు సంబంధించి అధికారిక మార్గదర్శకాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది.
ప్రభుత్వ ఆదేశాలు రాగానే లబ్ధిదారులను గుర్తించేలా సర్వే నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు.