
Araku Utsav 2025: అరకు ఉత్సవ్‌కు భారీ ఏర్పాట్లు.. సమీక్ష నిర్వహించిన కలెక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం హయాంలో నిలిపివేసిన అరకు ఉత్సవ్‌ను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఏర్పాట్లపై సమీక్షించారు. జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరగనున్న ఈ ఉత్సవాలను సందర్శకులను ఆకట్టుకునే విధంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఇందులో భాగంగా తగిన ఏర్పాట్లు చేయాలని, అరకు ఉత్సవ్ గురించి విస్తృత ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. ఉత్సవానికి సంబంధించిన ప్రమోషన్ క్యాంపైన్‌లో భాగంగా, లంబసింగి,వంజంగి,తాజంగి,కొత్తపల్లి జలపాతాలు,చాపరాయి వంటి ఆకర్షణీయ ప్రదేశాలతో కూడిన వీడియోలను ప్రదర్శించాలని సూచించారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో వివిధ రాష్ట్రాల నుండి కళాకారులను ఆహ్వానించి రోజువారీ కార్యక్రమాలను రూపొందించాలని సూచించారు.
వివరాలు
కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
అరకు ఉత్సవ్ కోసం వచ్చే కళాకారులకు వసతి, భోజన, రవాణా తదితర అవసరాలను పూర్తి చేయాలని, ఈ మేరకు అవసరమైన కమిటీలను ఏర్పాటు చేసి అధికారులకు విధులు, బాధ్యతలను స్పష్టం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే, ఉత్సవాలకు అయ్యే ఖర్చులపై బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రధాన ఏర్పాట్లు: ఉత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను ప్రొటోకాల్ ప్రకారం సిద్ధం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్ట్రీట్ లైట్స్, వెల్కమ్ ఆర్చ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు మూడు రోజుల పాటు పారిశుధ్యం నిర్వహణ, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు కోసం విశాఖపట్నం జీవీఎంసీ సహకారం తీసుకోవాలని ఆదేశించారు.
వివరాలు
పారా గ్లైడింగ్ ఆకర్షణ
మాడగడ వ్యూపాయింట్‌లో ఐటీడీఏ ఆధ్వర్యంలో పారా గ్లైడింగ్ అందుబాటులోకి తెస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తైంది. హిమాచల్ ప్రదేశ్ ఆరెంజ్ పారా గ్లైడింగ్ స్కూల్ పైలట్ విజయసోనీ టీమ్ ఈ ట్రయల్ రన్‌లో పాల్గొంది. గాలివాటం, వాతావరణ పరిస్థితులు, ప్రాంతానికి అనుకూలత వంటి అంశాలను పరిశీలించారు. మాడగడకు ఉన్న వ్యూపాయింట్ ప్రత్యేకతను పర్యాటకులకు చూపిస్తూ ఈ పారా గ్లైడింగ్ ఏర్పాటుతో మరింత ఆకర్షణగా మార్చాలని అధికారులు పేర్కొన్నారు. ఈ విధంగా, ఈసారి అరకు ఉత్సవం అద్భుతంగా జరగనుందని భావిస్తున్నారు.