LOADING...
Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు

Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2026
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పాఠశాలల్లో అకస్మాత్తుగా ఏర్పడే ఆరోగ్య సమస్యలకు తక్షణ వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో 'ఆరోగ్య నిర్వహణ (సిక్‌) గదులు' ఏర్పాటు చేయనున్నారు. ఈ గదుల్లో ప్రాథమిక చికిత్స అందించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమాన్ని సమగ్ర శిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో అమలు చేస్తూ,మార్చి నెలాఖరుకు ప్రత్యేక గదుల ఏర్పాటు,వైద్య వసతులను సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాఠశాలల్లో పరిమాణం ఎక్కువగా ఉన్న ఒక తరగతి గదిని రెండు భాగాలుగా విభజించి,అందులో సగం భాగాన్ని సిక్‌ రూమ్‌గా మార్చనున్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 629 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు.

వివరాలు 

ప్రత్యేక ఆరోగ్య కమిటీ

సిక్‌ రూమ్‌ల సమర్థవంతమైన నిర్వహణ కోసం పాఠశాల సిబ్బంది, ఆరోగ్య నిపుణులు, తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక ఆరోగ్య కమిటీని ఏర్పాటు చేయనున్నారు. స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల సహకారంతో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలకు పరిష్కారం చూపేందుకు శిక్షణ పొందిన మానసిక ఆరోగ్య కౌన్సిలర్ల సేవలను వినియోగించనున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, సబ్బుతో చేతులు కడుక్కునేందుకు ప్రత్యేక స్టేషన్లు, శుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు. బాలికల అవసరాల కోసం శానిటరీ ప్యాడ్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ఆరోగ్య నిర్వహణ గది ఏర్పాటు కోసం రూ.5 లక్షల చొప్పున ఎస్‌ఎస్‌ఏ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

వివరాలు 

అవగాహన కార్యక్రమాలు..

పాఠశాల స్థాయిలో పరిశుభ్రత, మానసిక ఆరోగ్యం, నెలసరి పరిశుభ్రత, సాధారణ అనారోగ్యాలపై అవగాహన శిబిరాలు నిర్వహించనున్నారు. ఆరోగ్య విద్యకు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులకు అందించడంతో పాటు, ఆరోగ్య అంశాలపై వీడియోలు తయారు చేసి ప్రదర్శించనున్నారు. స్థానిక ఆసుపత్రులతో కలిసి కాలానుగుణ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా డిజిటల్‌ ఆరోగ్య ప్రొఫైల్‌ను రూపొందిస్తారు. గాయాలు, ఎలర్జీలు వంటి అత్యవసర ఆరోగ్య పరిస్థితులపై మాక్‌డ్రిల్లులు నిర్వహించి విద్యార్థులు, ఉపాధ్యాయులను అప్రమత్తం చేస్తారు. టెలీమెడిసిన్‌ హాట్‌లైన్‌ ద్వారా అత్యవసర వైద్య సంప్రదింపుల సౌకర్యాన్ని కూడా కల్పించనున్నారు.

Advertisement

వివరాలు 

ఆరోగ్య నిర్వహణ గదుల్లో ఉండే ఔషధాలు

ఈ సిక్‌ రూమ్‌లలో ఫస్ట్‌ఎయిడ్‌ కిట్లు, యాంటీసెప్టిక్‌ ద్రావణాలు, ఆయింట్‌మెంట్లు, సర్జికల్‌ టేపులు, కత్తెరలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, డిస్పోజబుల్‌ గ్లౌజులు, అవసరమైన మందులు, సిరప్‌లు వంటి ప్రాథమిక వైద్య సామగ్రిని నిల్వ ఉంచనున్నారు.

Advertisement