జీఓ నెం.1ను సస్పెండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, ర్యాలీల నిర్వహణను నిషేధిస్తూ.. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వం నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. దీనిపై రాష్ట్రం ప్రభుత్వం జనవరి 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇటీవల కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాల్లో తొక్కిసలాట జరిగి.. పలువురు మృతి చెందారు. కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు మహిళలు చనిపోయారు. ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. జీఓ నెం.1ను తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్
తదుపరి విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం.1పై సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకష్ణ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాములు వాదనలు వినిపించారు.
ఈ క్రమంలో స్పందించిన ధర్మాసనం.. జీఓ నెం.1ను ఈ నెల 23వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.
చంద్రబాబును ప్రజల్లోకి వెళ్లనీయకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ జీఓను తీసుకొచ్చినట్లు టీడీపీ ఆరోపించింది. విపక్షాలు కూడా జీఓ నెం.1పై తీవ్రంగా స్పందిస్తున్నాయి.