Page Loader
కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?
చంద్రబాబు కందుకూరు పర్యటనలో విషాదం

కందుకూరు దుర్ఘటనకు కారణం ఎవరు? ప్రమాదంపై రాజకీయమా?

వ్రాసిన వారు Stalin
Dec 29, 2022
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. తోపులాటలో 8మంది మృతి చెందారు. అయితే దీనికి కారణం ఎవరనేదానిపై వైసీపీ- టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోకు జనం భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ నిలబడటానికి కూడా స్థలం లేకపోవడంతో.. కొందరు కాలువ అంచున నిల్చున్నారు. అనంతరం తోపులాట జరగడంతో.. ఆ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. ప్రధాని మోదీ సంతాపం.. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటంబాలకు సంతాపాన్ని తెలిపారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేల చొప్పును ఆర్థికసాయం ప్రకటించారు మోదీ.

కందుకూరు

టీడీపీ వర్సెస్ వైసీపీ

కందుకూరులో ఇరుకు ప్రదేశంలో రోడ్‌షో పెట్టడం వల్లే ప్రమాదం జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. జనం ఎక్కువ వచ్చారని చూపించుకోవాలనే తాపత్రయంతోనే చంద్రబాబు.. సందులో రోడ్‌షో పెట్టారని నాయకులు అంటున్నారు. చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్ల 8‌మంది చనిపోయారని విరుచుకుపడుతున్నారు. టీడీపీ కూడా అదేస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతోంది. నామమాత్రపు భద్రత వల్లే ఈ‌ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి ఆయన స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సింది పోయి.. అలా చేయకుండా.. నలుగురు ఎస్సైలు, ఇద్దరు సీఐలు, స్పెషల్ పార్టీ పోలీసులతో వైసీపీ ప్రభుత్వం సరిపెట్టిందని టీడీపీ విమర్శిస్తోంది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకొని.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్రప్రజల నుంచి వ్యక్తమవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రధాని కార్యాలయం నుండి ట్వీట్