AP Govt : ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేట్ డిగ్రీ,పీజీ కాలేజీల్లో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు ఇప్పటివరకు తప్పనిసరిగా చెల్లించాల్సిన రూ.15లక్షల కార్పస్ ఫండ్‌ను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇకపై కొత్త కోర్సుల అనుమతుల కోసం ఈ మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కొత్తగా ప్రైవేట్ కాలేజీని స్థాపించే సమయంలో మాత్రమే రూ.15 లక్షల కార్పస్ ఫండ్ చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కాలేజీలు కొత్త డిగ్రీ లేదా పీజీ కోర్సులు ప్రారంభించాలనుకుంటే అదనంగా కార్పస్ ఫండ్ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ సందర్భంగా ప్రైవేట్ కాలేజీల నిర్వహణకు సంబంధించిన పలు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
వివరాలు
కొత్త కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా ఫీజుల నిర్ణయం
అద్దె భవనాల్లో ప్రైవేట్ కాలేజీలను నిర్వహించే యాజమాన్యాలు కనీసం 30 సంవత్సరాల లీజు ఒప్పందం కలిగి ఉండాలని, ప్రతి ఏడాది అనుమతి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఒకవేళ లీజు కాలం 30 ఏళ్లకు మించి ఉంటే ఆ భవనాన్ని సొంత భవనంగా పరిగణించి, అదే ప్రాంగణంలో కాలేజీ కొనసాగించేందుకు అనుమతి ఇస్తామని వెల్లడించింది. కొత్త కోర్సుల అనుమతికి ప్రాంతాల వారీగా ఫీజులు నిర్ణయించింది. గిరిజన ప్రాంతాల్లో బీఏ కోర్సు ప్రారంభించేందుకు రూ.30 వేల ఫీజు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.40 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. బీఎస్సీ, బీకాం కోర్సులకు కూడా ప్రత్యేకంగా వేర్వేరు ఫీజులను నిర్ణయించింది.
వివరాలు
ప్రైవేట్ డిగ్రీ కాలేజీ పూర్తి వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించడం తప్పనిసరి
ప్రైవేట్ కాలేజీల తనిఖీల్లో డేటా అనలిటిక్స్,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పాటు ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది. అలాగే ఏదైనా ప్రైవేట్ కాలేజీ వరుసగా ఆరేళ్ల పాటు విద్యా కార్యకలాపాలు నిర్వహించకపోతే ఆ సంస్థకు అనుమతులను పునరుద్ధరించబోమని హెచ్చరించింది. ప్రతి ప్రైవేట్ డిగ్రీ కాలేజీ పూర్తి వివరాలతో అధికారిక వెబ్‌సైట్‌ను నిర్వహించడం తప్పనిసరి చేసింది. ప్రతి ఏడాది సెప్టెంబరు 30లోపు వెబ్‌సైట్‌ను నవీకరించాలని ఆదేశించింది.
వివరాలు
ఉల్లంఘనలకు పాల్పడితే..
గత మూడు సంవత్సరాల్లో మంజూరైన సీట్లు, విద్యార్థుల ప్రవేశాలు, ఉత్తీర్ణత శాతం, అధ్యాపకుల అర్హతలు తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అంతేకాకుండా, నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం లేదా తప్పుడు సమాచారాన్ని అందించడం వంటి ఉల్లంఘనలకు పాల్పడితే లక్షల రూపాయల జరిమానాతో పాటు సంబంధిత యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.