LOADING...
Sea Plane Project: ఏపీలో సీ ప్లేన్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌.. 10 చోట్ల సీప్లేన్లు
ఏపీలో సీ ప్లేన్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌.. 10 చోట్ల సీప్లేన్లు

Sea Plane Project: ఏపీలో సీ ప్లేన్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌.. 10 చోట్ల సీప్లేన్లు

వ్రాసిన వారు Sirish Praharaju
May 21, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీ ప్లేన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో సీ ప్లేన్‌ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్‌ పథకం కింద రూ.200కోట్లు మంజూరు చేసింది. ప్రతి ప్రాంతానికి రూ.20 కోట్ల చొప్పున నిధులు కేటాయించారు.ఈ పనులను రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ పర్యవేక్షించనుంది. గతఏడాది విజయవాడ బెర్మ్‌ పార్కు నుంచి శ్రీశైలం వరకు నిర్వహించిన ప్రయోగాత్మక ప్రయాణంలో ముఖ్యమంత్రి స్వయంగా సీ ప్లేన్‌లో ప్రయాణించారు. రాష్ట్రంలో విస్తారంగా నదులు,సముద్రతీరం,జలాశయాలు ఉండటంతో మరిన్ని ప్రాంతాల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. దీనితో మరో తొమ్మిది ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించారు.

వివరాలు 

భూ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

సీ ప్లేన్‌ సేవలకు అవసరమైన ఏరోడ్రోమ్‌లు, తేలియాడే జెట్టీలు, డాక్‌లు, ప్రయాణికుల కేంద్రాలు వంటి మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. అవసరమైన చోట్ల భూ సేకరణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సీ ప్లేన్‌ సేవల నిర్వహణకు పౌర విమానయాన శాఖ, భారత విమానాశ్రయాల సంస్థ, తీర నియంత్రణ సంస్థ, పర్యావరణ అనుమతులు అవసరం కావడంతో వాటి కోసం అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అనుమతుల ప్రక్రియ పూర్తైన తర్వాత ప్రైవేట్‌ సంస్థలను ఆహ్వానించనున్నారు. ఇప్పటికే రెండు సంస్థలు ఆసక్తి చూపినట్లు సమాచారం.

వివరాలు 

ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో అమలు

ఉడాన్‌ పథకం కింద నడిచే విమాన సర్వీసుల్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు కేంద్రం లోటు భర్తీ నిధుల రూపంలో సాయం అందిస్తోంది. ఇదే విధానాన్ని సీ ప్లేన్‌ సేవలకు కూడా కొంతకాలం వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. సీ ప్లేన్‌ ప్రాజెక్టును ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేట్‌ సంస్థల ద్వారా సేవలు నిర్వహించేలా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణగా ఈ ప్రాజెక్టు నిలవనుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

సీ ప్లేన్‌ల ప్రత్యేకతలు

నదులు, సముద్ర తీరాలు, జలాశయాలు, ఆనకట్టల ప్రాంతాల్లో సీ ప్లేన్‌లు నడపవచ్చు. విమానం ఎగరడం, దిగడం పూర్తిగా నీటి మీదే జరుగుతుంది. ఇందుకోసం నీటిమీద ప్రత్యేక ప్రదేశాన్ని గుర్తించి ఏర్పాట్లు చేస్తారు. ప్రయాణికులు ఎక్కడానికి, దిగడానికి నీటిమీద తేలియాడే జెట్టీ, డాక్‌ నిర్మిస్తారు. చిన్న విమానాశ్రయం తరహాలో ప్రయాణికుల కేంద్రం ఏర్పాటు చేసి టికెట్‌ కౌంటర్‌, నిరీక్షణ మందిరం, భద్రత తనిఖీ సదుపాయాలు కల్పిస్తారు. సీ ప్లేన్‌ సేవలకు ప్రతిపాదించిన ప్రాంతాలు విజయవాడ, శ్రీశైలం, తిరుపతి రాయలచెరువు, సూర్యలంక, గండికోట, కాకినాడ, విశాఖపట్నం, అరకు జోలాపుట్‌, లంబసింగి తాజంగి జలాశయం, పోలవరం ప్రాంతాలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

Advertisement