LOADING...
Andhra Pradesh : విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక
విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక

Andhra Pradesh : విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించగా, డేటా సెంటర్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు దీర్ఘకాలిక పవర్ ట్రాన్స్‌మిషన్ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. రానున్న పదేళ్లలో డేటా సెంటర్ల విద్యుత్ అవసరం భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రస్తుతం రూపొందించిన ప్రణాళిక ప్రకారం 2036-37 నాటికి ఈ రంగానికి అవసరమైన మొత్తం విద్యుత్ డిమాండ్ దాదాపు 15 గిగావాట్లకు చేరుకునే అవకాశముంది. దీనికి అనుగుణంగా విద్యుత్ ప్రసార వ్యవస్థలను ఆధునీకరించి, కొత్త మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

వివరాలు 

విశాఖ ప్రాంతంలో 16 భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు

విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో డేటా సెంటర్లకు విద్యుత్ సరఫరాపై సమగ్రంగా చర్చించారు. ఏపీ ట్రాన్స్‌కో అంచనాల ప్రకారం విశాఖ ప్రాంతంలో ప్రస్తుతం 16 భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి వల్ల సుమారు 9.1 గిగావాట్ల ఐటీ విద్యుత్ లోడ్ ఏర్పడనుండగా, అనుబంధ మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాల అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం డిమాండ్ 15 గిగావాట్ల వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 765 కేవీ, 400 కేవీ, 220 కేవీ స్థాయిల్లో అత్యాధునిక ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నారు.

వివరాలు 

రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం

పెందుర్తి, అచ్యుతాపురం, పలాస, పద్మనాభం, మాకవారిపాలెం వంటి కీలక సబ్‌స్టేషన్లను అనుసంధానిస్తూ ఈ విద్యుత్ వ్యవస్థను నిర్మించనున్నారు. 2034 నాటికి ఈ నెట్‌వర్క్ 15 గిగావాట్లకు పైగా డేటా సెంటర్ విద్యుత్ లోడ్‌ను మోయగల సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాంబిల్లి డేటా సెంటర్ క్లస్టర్ అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ ప్రాంతంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కొత్త 400 కేవీ, 220 కేవీ సబ్‌స్టేషన్లు, అధిక సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలు, ప్రత్యేక ట్రాన్స్‌మిషన్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే తార్లువాడ, ముడసర్లోవ, పోలేపల్లి, చిన్నిపాలెం ప్రాంతాల్లో కూడా డేటా సెంటర్ హబ్‌లకు అవసరమైన విద్యుత్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

వివరాలు 

రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు

విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుపై గూగుల్, రిలయన్స్, టీసీఎస్ హైపర్‌వాల్ట్, సీటీఆర్‌ఎల్ఎస్ (CtrlS), జీఎంఆర్ వంటి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు, ఆంధ్రప్రదేశ్ దేశంలోని ప్రధాన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Advertisement