Andhra Pradesh: భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ వ్యాప్తంగా ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది. పలు ప్రాంతాల్లో 48 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా 18 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎండల తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాలలో ఆదివారం 48.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే గరిష్ఠంగా అధికారులు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 26న కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వివరాలు
174 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 13 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 17 జిల్లాల పరిధిలోని 174 మండలాల్లో 44 డిగ్రీలకు మించిన ఎండలు నమోదయ్యాయి. సోమ, మంగళవారాల్లో కూడా తీవ్ర వడగాలులు కొనసాగనున్నాయని అధికారులు హెచ్చరించారు. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
వివరాలు
వడదెబ్బతో 18 మంది మృతి
ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలకు చెందిన తమ్మిశెట్టి రాయన్న(80), తిరువూరుకు చెందిన గజ్జల స్వరాజ్యలక్ష్మి(53), కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన తమ్మిశెట్టి సాంబయ్య(45), పెనమలూరులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన బిపుల్‌దాస్(49) వడదెబ్బకు గురై మృతిచెందారు. విజయవాడ రైల్వే నిలయంలో ఓ మహిళా ప్రయాణికురాలు(55), చిట్టినగర్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి(45), అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు కూడలిలో ఓ యాచకుడు(53) ప్రాణాలు కోల్పోయారు. తూర్పుగోదావరి జిల్లాలో తిరుసూల సత్యనారాయణ(50), బూరిగ కన్నమ్మ(84), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పేరాబత్తుల వెంకటరత్నం(44), సరిదే భాను(65) మృతిచెందారు.
వివరాలు
విజయవాడలో గాలివాన బీభత్సం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గంగాధరన్ బాలరామన్(49), రాజు(50), బొదుకోళ్ల జయరాజు(60), గవర్ల పెరుమాళ్(80), నోముల వంశీ(35), నెళ్లి రంగారావు(50), మరో యాచకుడు(49) ఎండ తీవ్రతను తట్టుకోలేక మృతిచెందారు. విజయవాడ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మహానాడు కూడలిలో భారీ ప్రకటన ఫలకం జాతీయ రహదారిపై కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.