
Rain Alert: ఆంధ్రప్రదేశ్,తెలంగాణకు వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడి ఉంది.
ఇవాళ పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి కొనసాగుతోంది.
అలాగే, దిగువ ట్రోపో ఆవర్తనంలో ఆంధ్రప్రదేశ్, యానాంలలో నైరుతి,దక్షిణ దిశలో గాలులు వీస్తున్నట్లు గుర్తించారు.
వివరాలు
ఉత్తరాంధ్రలో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
సోమవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెదురుమదురు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
పిడుగుల ప్రమాదం ఉన్నందున పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, టవర్స్ లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవరాదని అధికారుల సూచన వచ్చింది.
పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా పంట నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
వడగండ్ల వాన ప్రభావం ముఖ్యంగా కడప, అనంతపురం, సత్యసాయి,ప్రకాశం జిల్లాల్లో కనిపించింది.
10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు నివేదించారు. మొత్తం 1,364 మంది రైతుల 1,670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు.
వివరాలు
తెలంగాణలో ఎల్లో అలర్ట్
అకాల వర్షాలు, వడగండ్ల వాన ప్రభావాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులకు సీఎం సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం రైతులకు అవసరమైన సాయం అందిస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని, అనంతరం 2-3 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
వివరాలు
అకాల వర్షాలతో పంట నష్టం
తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి.
వడగండ్ల వాన, ఈదురు గాలుల కారణంగా వరి, మామిడి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
కరీంనగర్ జిల్లాలోని 13 గ్రామాల్లో 336 ఎకరాల పంట నష్టాన్ని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 321 ఎకరాల్లో మొక్కజొన్న, 15 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది.
చొప్పదండి, రామడుగు,కరీంనగర్ కొత్తపల్లి మండలాల్లో 213 మంది రైతులకు చెందిన పంటలు పూర్తిగా నాశనమయ్యాయి.
ఇప్పటికే సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అకాల వర్షాలు రైతులకు మరింత నష్టం కలిగించాయి.
నీటి ట్యాంకర్లు తెచ్చి పంటలను కాపాడుకుంటున్న రైతులు, ఇప్పుడు వర్షాల కారణంగా పంటలను పూర్తిగా నష్టపోయారని వాపోయారు.
వివరాలు
రైతులు ఆవేదన
ముఖ్యంగా మామిడి కాయల దశలో ఉన్న నేపథ్యంలో, వడగండ్ల వాన మామిడి పండ్లను నేలరాల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుల నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేసి తగిన సాయం అందించాలనే డిమాండ్ రైతుల నుంచి వినిపిస్తోంది.