Nara Lokesh: మారిటైం,పారిశ్రామిక రంగాలకు ఏపీని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతాం: లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
ఆగ్నేయాసియా దేశాలతో సముద్ర రవాణా రంగంలో బలమైన, దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సముద్ర అనుసంధానం, ఆధునిక సాంకేతికత, స్వచ్ఛ ఇంధనం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆయా దేశాలతో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇండియా ఫౌండేషన్, కేంద్ర విదేశాంగ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో నిర్వహించిన ఏషియన్-ఇండియా మారిటైం కాంక్లేవ్‌లో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని, పోర్టుల సామర్థ్యాన్ని ఉపయోగించుకుని ఏపీని అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
వివరాలు
నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు
విశాఖపట్నానికి ఎంతో గొప్ప సముద్ర చరిత్ర ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ నగరం ప్రస్తుతం వాణిజ్యం, సాంకేతిక రంగాల్లోనూ కీలక కేంద్రంగా ఎదుగుతోందన్నారు.
దేశంలోనే అత్యంత పొడవైన తీర ప్రాంతాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కు సుమారు 1,053కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని ప్రధాన మారిటైం, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం పోర్టు రికార్డు స్థాయిలో 91.17మిలియన్ టన్నుల సరకు రవాణాను నిర్వహించిందని వెల్లడించారు.
ఈ విషయంలో దాదాపు 10శాతం వృద్ధి నమోదైందని చెప్పారు.
ప్రస్తుతం రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడలో నాలుగు కొత్త పోర్టుల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు.
వివరాలు
దుగరాజపట్నంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడితో భారీ నౌకా నిర్మాణ క్లస్టర్
వీటి ద్వారా రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడటంతోపాటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు పొరుగు రాష్ట్రాల్లోని పరిశ్రమలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
దుగరాజపట్నంలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడితో భారీ నౌకా నిర్మాణ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు లోకేశ్ వెల్లడించారు.
ఇటీవలే విశాఖపట్నంలో పోర్టుల విస్తరణ, లాజిస్టిక్స్, ప్రత్యేక టెర్మినల్స్, నౌకల మరమ్మతులు తదితర రంగాలకు సంబంధించి సుమారు రూ.7,500 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.
పోర్టులను పరిశ్రమలకు, పరిశ్రమలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించడం తమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
వివరాలు
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాధాన్యం
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని లోకేశ్ తెలిపారు.
సాగరమాల,మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 వంటి కార్యక్రమాల ద్వారా పోర్టులు,నౌకా నిర్మాణం,సముద్ర రవాణా,సరకు నిర్వహణ,మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు వివరించారు.
భారత్‌లో నౌకా నిర్మాణం, సముద్ర రవాణా రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రివర్గం సుమారు రూ.70 వేల కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.
వివరాలు
సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థకు కేంద్రం ప్రాధాన్యం
ఇందులో రూ.25 వేల కోట్ల మారిటైమ్ డెవలప్‌మెంట్ ఫండ్ కూడా ఉందని వెల్లడించారు.
భారతదేశ వాణిజ్యంలో దాదాపు 95 శాతం సరకు రవాణా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోందని లోకేశ్ గుర్తుచేశారు.
దేశ ఆర్థిక పురోగతికి ఆధునిక పోర్టులు, మెరుగైన నౌకాయాన మౌలిక సదుపాయాలు ఎంతో అవసరమని చెప్పారు.
నిర్మించే ప్రతి కొత్త పోర్టు పరిశ్రమల అభివృద్ధికి, వ్యాపార విస్తరణకు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు దోహదపడుతుందని వివరించారు.