Andhra Pradesh: జూన్ 7 నుంచి ఏపీలో యోగా ఉత్సవాలు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ ఏడాది యోగా కార్యక్రమాల్లో సుమారు 2.5 లక్షల మందిని భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరింత మంది సర్టిఫైడ్ యోగా సాధకులను తయారు చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ఈ క్రమంలో వెస్ట్రన్ బైపాస్ ప్రాంతంలో 25 వేల మందితో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్కొన్నారు. యోగా ద్వారా ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
వివరాలు
యోగాపై అవగాహనకు ప్రత్యేక వీడియోలు
యోగా, నేచురోపతి సలహాదారు మంతెన సత్యనారాయణ మాట్లాడుతూ యోగాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలు వీడియోలను రూపొందించినట్లు తెలిపారు. యోగా అంశాలపై ఒక్కోటి ఐదు నిమిషాల నిడివితో మొత్తం 90 వీడియోలను సిద్ధం చేసినట్లు చెప్పారు. అలాగే 21 రకాల వ్యాధులకు సంబంధించిన యోగా సాధనలపై 15 నిమిషాల నిడివితో ప్రత్యేక వీడియోలను రూపొందించామని వెల్లడించారు. యోగాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే లక్ష్యంతో మరో 50 అవగాహన వీడియోలను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలను పొందాలనుకునే వారు 81424 04888 నంబర్‌కు వాట్సాప్‌లో "హాయ్" అని సందేశం పంపితే లింక్ అందుతుందని చెప్పారు. ఆ లింక్ ద్వారా యోగా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చని వివరించారు.