Ap Weather: ఏప్రిల్‌లో పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల నుంచి వేడి తీవ్రత మరింత పెరగనుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని మించి నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా ఇదే విధంగా అధికంగా ఉండనున్నాయని అంచనా వేసింది. మంగళవారం విడుదల చేసిన వేసవి సీజనల్ అవుట్‌లుక్‌లో ఐఎండీ ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రాష్ట్రంలో వడగాలులు సాధారణం కంటే ఎక్కువ రోజులు ప్రభావం చూపనున్నాయి. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలను మినహాయించి దాదాపు రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీసే పరిస్థితి ఉంది.
వివరాలు
కోస్తా ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత
ఇక ఏప్రిల్ నెలలో కోస్తా ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగుతుందని అంచనా. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో ఆశ్చర్యకరంగా రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వాతావరణ మార్పుల ప్రభావంతో వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక వేడి కారణంగా వరి, పెసర, మినుము, కూరగాయల దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. అలాగే మామిడి, అరటి పంటల్లో పూత, పిందె రాలిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
వివరాలు
రైతులు జాగ్రత్త..: ఐఎండీ
ఈ పరిస్థితుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. పంటలు ఎండ తట్టుకునేలా నేలలో తగిన తేమ ఉండేలా తరచుగా నీటి తడులు ఇవ్వాలని సూచించింది. అదనంగా వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు పొటాషియం లేదా యాంటీ ట్రాన్స్‌పరెంట్లను ఆకులపై పిచికారీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
నేడు 10 మండలాల్లో వడగాలుల హెచ్చరిక
మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత తగ్గినప్పటికీ, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే బుధవారం మళ్లీ వేడి పెరగనుందని అధికారులు తెలిపారు. పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీయనున్నాయి. అలాగే విజయనగరం జిల్లా బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, సీతానగరం, పోలవరం జిల్లా ఎటపాక మండలాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి. ఇక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.