
Rain Alert:ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు..కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ..
ఈ వార్తాకథనం ఏంటి
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, పలు ప్రాంతాల్లో వర్షాలను కలిగిస్తోంది.
ఈ ప్రభావంతో కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని హెచ్చరించింది.
ఈ అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడంతో పాటు తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు కూడా అప్రమత్తత సూచనలు జారీ చేసింది.
అలాగే మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని ప్రజలకు సూచించింది.
వివరాలు
రైతులు ఆందోళన
భారీ వర్షాల దృష్ట్యా వాతావరణ శాఖ కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమలో వచ్చే మూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని అంచనా వేసింది.
ఇక, భారీ వర్షాల వార్తలతో పంటలను కోసి పొలాల్లో ఉంచిన రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే కృష్ణా జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయి. చేతికొచ్చిన పంట వరుణుడి దయకు లోనవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట ఇన్సూరెన్స్ సదుపాయం గతంలో ఉండగా, ఇప్పుడు అది అందుబాటులో లేకపోవడం వల్ల వారి బాధలు పెరిగాయని చెబుతున్నారు.
వివరాలు
ఫెంగల్ తుపాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వరుస వర్షాలు
తుపానులు లేదా భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగినప్పటికీ, ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం గ్రామస్థాయి రాజకీయాల కారణంగా అందకపోతుందనే గళం వినిపిస్తోంది.
ఇక ఇటీవల కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వదలడం లేదు. సరిహద్దు రాష్ట్రాల్లో తుపానులు వచ్చినప్పటికీ, ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలుగా మారుతోంది.
అక్టోబర్‌లో దానా తుపాన్, నవంబర్‌లో ఫెంగల్ తుపాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వరుస వర్షాలు కురుస్తున్నాయి.
ఫలితంగా రైతులతో పాటు అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.