AP Weather : ఏపీ ప్రజలకు అలర్ట్ .. రాబోయే నాలుగు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే నాలుగు రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాలుల ప్రభావం కొనసాగుతుందని తెలిపింది. సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ ప్రకారం, బుధవారం రాష్ట్రంలోని 76 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, మరో 134 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
వివరాలు
వర్షాలు పడే సూచనలు
గురువారం 51 మండలాల్లో తీవ్రమైన వడగాలులు, 94 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడే సూచనలు ఉన్నాయి. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తా ప్రాంతం, యానాంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచవచ్చు. మొత్తంగా ఏప్రిల్ 25 వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూనే వర్షాలు కూడా పడే పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
మే నెలలో రాయలసీమ పరిస్థితి
మే నెలలో రాయలసీమ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగే అవకాశముంది. ఇప్పటికే ఏప్రిల్‌లోనే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. మే నెలలో ఇవి మరో రెండు డిగ్రీలు పెరిగి 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. పట్టణాల్లో బీటీ రహదారులపై ఉష్ణోగ్రతలు 49 డిగ్రీలకంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశముంది. ఈ ప్రాంతంలో తరచుగా వేడి, పొడి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
వివరాలు
మే నెలలో రాయలసీమ పరిస్థితి
సాధారణ సంవత్సరాలతో పోలిస్తే ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ నెలలోనే పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతుండటం గమనించదగిన విషయం. ఇది తీవ్రమైన వేసవి పరిస్థితులు ముందుగానే ప్రారంభమవుతున్నాయని సూచిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలం పాటు కొనసాగే వడగాలుల ప్రభావం వ్యవసాయంపై పడే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక వేడిని తట్టుకోలేని పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.