Andhra Pradesh Weather: ఏపీలో పిడుగుల వర్షం.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం వాతావరణం మిశ్రమంగా ఉండనుంది. తూర్పు విదర్భ, తెలంగాణ మీదుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కూడా కొనసాగే అవకాశముందని హెచ్చరించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు. ద్రోణి ప్రభావంతో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయని అధికారులు వెల్లడించారు. పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా కనిపించవచ్చని పేర్కొన్నారు.
వివరాలు
చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరిక
బుధవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ముఖ్యంగా చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడకూడదని హెచ్చరించింది. ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపడి ఉండే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
వివరాలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం
ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు, శ్రామికులు, పశువుల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. పిడుగుల సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రమాదకరమని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని వైద్య నిపుణుల సూచన
అత్యవసర పరిస్థితులు తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకుండా ఉండాలని, బయటకు వెళ్లాల్సి వస్తే వేడిగాలుల నుంచి రక్షణ పొందేలా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నవారు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్త పడాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు, పిడుగులు, ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది.