ANGRAU: ఎల్‌నినో ప్రభావం.. జిల్లాల వారీగా పంటల సాగుపై ఆంగ్రూ ప్రత్యేక ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
ఖరీఫ్ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం కనిపించే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు సూచించారు. వర్షాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం, వర్షపాతం అస్థిరత, మధ్య మధ్యలో దీర్ఘకాలిక పొడి వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నష్టాలను తగ్గించుకునేలా జిల్లాల వారీగా ప్రత్యేక పంటల ప్రణాళికను రూపొందించారు. స్థానిక నేలల స్వభావం, నీటి లభ్యత, వర్షపాతం అంచనాలను పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాలకు అనువైన పంటలను ఎంపిక చేశారు.
వివరాలు
ఉత్తరాంధ్రలో చిరుధాన్యాలకు ప్రాధాన్యం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నేరుగా విత్తే వరి సాగుతో పాటు మొక్కజొన్న, వేరుశనగ, నువ్వులు, రాగులు, సజ్జలు, పెసర, మినుము, పత్తి వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం వంటి గిరిజన ప్రాంతాల్లో వరితో పాటు మొక్కజొన్న, రాగులు, సామలు, కొర్రలు వంటి చిరుధాన్యాల సాగు రైతులకు మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
వివరాలు
గోదావరి జిల్లాల్లో నీటి లభ్యతకు అనుగుణంగా వరి సాగు
తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో వరి ప్రధాన పంట అయినప్పటికీ నీటి లభ్యతను బట్టి స్వర్ణ, ఎంటీయూ-1318, ఎంటీయూ-1224, బీపీటీ-5204 రకాల వరిని సాగు చేయాలని ఆంగ్రూ సూచించింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వరితో పాటు మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి పంటలను పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని తెలిపింది. అలాగే ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పత్తి, కంది, వేరుశనగ సాగు అనుకూలంగా ఉండగా, నెల్లూరు జిల్లాలో పెసర, మినుము, కంది, అలసంద, కొర్రలు, మేతజొన్న వంటి పంటలు రైతులకు మంచి ప్రత్యామ్నాయాలుగా ఉంటాయని శాస్త్రవేత్తలు సూచించారు.
వివరాలు
రాయలసీమలో అంతర పంటలతో నష్టాల నివారణ
ఎల్‌నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పత్తి, వేరుశనగ, కంది, ఆముదం, సజ్జలు, కొర్రలు, రాగులు వంటి పంటలను సాగు చేయాలని ఆంగ్రూ శాస్త్రవేత్తలు సూచించారు. ప్రత్యేకంగా అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వేరుశనగతో పాటు కంది, ఆముదం వంటి అంతర పంటల సాగు విధానాన్ని అవలంబిస్తే వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు నష్టాలను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి వినియోగంలో పొదుపు, అంతర పంటల సాగుపై దృష్టి పెడితే ఖరీఫ్ సీజన్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆంగ్రూ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.