LOADING...
Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు
నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు

Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 07, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో రూపొందించిన దేశవ్యాప్తంగా 26 రకాల పంటలకు చెందిన 184 అధిక దిగుబడి వంగడాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ దిల్లీలో అధికారికంగా విడుదల చేశారు. ఈ జాబితాలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన సజ్జలు, నువ్వులు, వరిగ, బీడి పొగాకు వంగడాలు చోటు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ ఆర్‌. శారద జయలక్ష్మీదేవి, ఈ విజయానికి కారణమైన శాస్త్రవేత్తలు మరియు సిబ్బందిని మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు.

వివరాలు 

పంట: నువ్వు 

వైఎల్‌ఎం-146 అనే నువ్వు వంగడం 90 నుంచి 95 రోజుల పంట కాలపరిమితితో రూపొందించబడింది. వేసవి సాగుకు అనుకూలంగా ఉండే ఈ వంగడం హెక్టారుకు 8 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుంది. గింజల్లో సుమారు 44.4 శాతం నూనె శాతం ఉండటం విశేషం. పశ్చిమ బెంగాల్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగుకు ఈ వంగడాన్ని సిఫార్సు చేశారు. ఎలమంచిలి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఈ వంగడాన్ని అభివృద్ధి చేసింది.

వివరాలు 

పంట: సజ్జ 

ఏపీహెచ్‌బీ-126 అనే సజ్జ వంగడం 84 నుంచి 86రోజుల పంట కాలవ్యవధితో ఖరీఫ్‌,రబీ కాలాలకు అనువుగా రూపొందించారు. హెక్టారుకు 30 నుంచి 33 క్వింటాళ్ల వరకు దిగుబడి అందించే సామర్థ్యం ఈ వంగడంలో ఉంది. గింజల్లో ఇనుము, జింక్‌ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండటం ప్రత్యేకత. అనంతపురం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ వంగడాన్ని అభివృద్ధి చేసింది. పంట: వరిగ పీఎంవీ-480 (అల్లూరి)పేరుతో విడుదలైన వరిగ వంగడం 72నుంచి 77రోజుల పంట వ్యవధితో ఖరీఫ్‌ సాగుకు అనుకూలంగా ఉంది. హెక్టారుకు సగటున 2.27 టన్నుల దిగుబడిని ఇస్తుంది. గింజల్లో ప్రోటీన్‌ శాతం ఎక్కువగా ఉండటం రైతులకు,వినియోగదారులకు లాభదాయకంగా నిలుస్తోంది. ఈ వంగడాన్ని విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానం అభివృద్ధి చేసింది.

Advertisement

వివరాలు 

పంట: బీడి పొగాకు 

ఏబీడీ-132 అనే బీడి పొగాకు వంగడం 195 నుంచి 210 రోజుల పంట కాలవ్యవధితో ఖరీఫ్‌ వర్షాధార సాగుకు అనుకూలంగా రూపొందించారు. ఈ వంగడంలో పొగలో ఉండే హానికర అంశాల శాతం తక్కువగా ఉండటం ప్రధాన లక్షణం. నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఈ వంగడాన్ని అభివృద్ధి చేసింది. ఈ నాలుగు వంగడాల జాతీయ విడుదలతో రైతులకు అధిక దిగుబడి, మెరుగైన నాణ్యతతో పాటు సాగు లాభదాయకత పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement