LOADING...
Anna Hazare: జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష 
జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష

Anna Hazare: జనవరి 30న అన్నా హజారే నిరాహార దీక్ష 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో జనవరి 30 నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ప్రకటించారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజా సంక్షేమానికి అత్యంత కీలకమైన ఈ చట్టం అమలు విషయంలో ప్రభుత్వం పదేపదే హామీలు ఇచ్చి, వాటిని విస్మరిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఈ నిర్లక్ష్యానికి నిరసనగా తాను చేపట్టబోయే దీక్షే తన జీవితంలోని చివరి నిరసన కావచ్చని హజారే భావించారు.

Details

  అప్పటి హామీలు

2022లో కూడా ఇదే డిమాండ్‌తో రాలేగావ్‌ సిద్ధిలో హజారే నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో అప్పటి ముఖ్యమంత్రి లోకాయుక్తను అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆయన నిరసనను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ఒక ప్రత్యేక కమిటీ చట్టాన్ని తయారు చేసింది. ఈ బిల్లును మహారాష్ట్ర శాసనసభలోని ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు.

Details

ఇంకా ఎందుకు అమలు కాలేదు? 

అయితే ఆ చట్టం ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదని హజారే తీవ్రంగా విమర్శించారు. ఈ విషయం మీద ముఖ్యమంత్రి ఫడణవీస్‌కు తాను ఏడు లేఖలు రాసినప్పటికీ, ఏ ఒక్క లేఖకూ స్పందన రాకపోవడం బాధాకరమని అన్నారు. ఇన్నేళ్లు గడిచినా లోకాయుక్త చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. హజారే నిరాహార దీక్ష నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తీవ్ర చర్చకు దారితీయడం ఖాయం.

Advertisement