Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్‌బై?.. ఢిల్లీలో హైడ్రామా!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో సమావేశమైన అనంతరం తన రాజీనామా పత్రాన్ని వారికి సమర్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నేటి సాయంత్రం అన్నామలై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తనను తప్పించడం, అలాగే తమిళనాడులో అన్నాడీఎంకేతో పార్టీ పొత్తు పెట్టుకోవడంపై అన్నామలై అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా వార్తలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
వివరాలు
పార్టీలోనే కొనసాగాలని అధిష్ఠానం ప్రయత్నం
అయితే ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో అన్నామలై భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు అన్నామలైని పార్టీలోనే కొనసాగించాలని భాజపా అధిష్ఠానం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడే వరకు ఢిల్లీని వీడవద్దని నితిన్ నబీన్ అన్నామలైకి సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన భవిష్యత్ రాజకీయ అడుగులపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వివరాలు
కొత్త పార్టీ దిశగా అడుగులు?
ఇదిలా ఉండగా, భాజపాను వీడిన తర్వాత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో అన్నామలై ఉన్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పార్టీ ఏర్పాటుకు సంబంధించి తన నిర్ణయాన్ని మరో రెండు రోజుల్లో వెల్లడిస్తానని అన్నామలై మీడియాతో చెప్పినట్లు సమాచారం. నేపథ్యంలో ఆయన భాజపాలోనే కొనసాగుతారా? లేక సొంత రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుడతారా? అన్నది తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.