TMC: మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు.. అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ గుండాలు సాగించిన దురాగతాలపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలు కూడా తృణమూల్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పలువురు ముఖ్య నేతలు పార్టీకి దూరమవుతున్నారు. కొందరు పూర్తిగా రాజీనామా చేస్తుండగా, మరికొందరు పార్టీ పదవులను వదులుకుంటున్నారు. తాజాగా మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ శంతను సేన్ తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాధ్యతలకు గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామా వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనతో పాటు పార్టీపై నిరంతరం వస్తున్న అవినీతి ఆరోపణల కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆయన తెలిపారు.
వివరాలు
కళ్యాణ్ బెనర్జీకి లోక్‌సభలో పార్టీ విప్ బాధ్యతలు
ఈ పరిస్థితుల్లో పార్టీ తరఫున మాట్లాడే స్థితిలో తాను లేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, శంతను సేన్ నిర్ణయానికి ముందు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేరున్న పార్లమెంట్ సభ్యురాలు కాకోలి ఘోష్ కూడా పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆమె పార్టీ సభ్యత్వాన్ని మాత్రం వదులుకోలేదు. ప్రస్తుతం ఆమె తృణమూల్ కాంగ్రెస్ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగానే కొనసాగుతున్నారు. కాకోలి రాజీనామా అనంతరం లోక్‌సభలో పార్టీ విప్ బాధ్యతలను ఆమె నుంచి తొలగించి కళ్యాణ్ బెనర్జీకి అప్పగించినట్లు సమాచారం.