
Pashamylaram: పాశమైలారంలో మరో భారీ అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదం నుంచి ఇంకా ప్రజలు తేరుకోకముందే, అదే ప్రాంతంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సారి ఎన్ వీరో వెస్ట్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీ మంటల్లో చిక్కుకుంది. ఆదివారం (జూలై 13) ఉదయం పటాన్‌చెరు మండలంలోని పాశమైలారులో ఉన్న ఈ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడటంతో అక్కడ అలజడి రేగింది. పొగలతో చుట్టుపక్కల ప్రాంతమంతా కమ్ముకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
Details
దర్యాప్తు చేపడుతున్న అధికారులు
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపుపై చర్యలు చేపట్టారు. ఎంతమాత్రం ఆలస్యం కాకుండా స్పందించిన అగ్నిమాపక దళం, మంటలు పక్క ఫ్యాక్టరీలకి వ్యాపించకుండా నియంత్రించగలిగింది. ఇప్పటివరకు ప్రాణ నష్టం లేదా గాయాల గురించి స్పష్టమైన సమాచారం బయటకు రాలేదు. గతంలో సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ఇప్పుడు మళ్లీ అదే ప్రాంతంలో మంటలు చెలరేగడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా జరిగిన ఘటనపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.